ఇక దక్షిణాదిన కరోనా విలయతాండవం

కొద్ది రోజుల నుంచి ఢిల్లీ, ముంబై, కోల్ కతా నగరాల్లో కరోనా థర్డ్ వేవ్ ఉథృతంగా కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ నగరాల్లో రోజువారీ కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయని ఐఐటీ ప్రొఫేసర్ మనీంద్రా అగర్వాల్ తెలిపారు. 
 
అయితే రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వచ్చే వారం కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతాయని చెబుతున్నారు. కరోనాను కట్టడి  చేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
 
రాబోయే రెండు వారాల్లో ఇతర రాష్ట్రాల్లో కరోనా థర్డ్ వేవ్ పీక్ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ వారం మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి.

మరోసారి ఆస్పత్రిలో చేరిన కమలహాసన్

ప్రముఖ నటుడు,మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆయన ఉదయం నుంచి ఆస్వస్థతకు గురి కావడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కమల్‌ హాసన్‌ ను చేర్పించినట్లు సమాచారం. ఆయన ఇటీవలే అమెరికా వెళ్లి తన దుస్తుల బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 భారత్ కు తిరిగి రాగానే కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో చెన్నై శ్రీరామచంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. 

మళ్లీ ఇంతలోనే ఆయన ఆస్పత్రిలో  చేరడం కలకలం రేపింది. అయితే, కమల్ సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. అయితే  ఆయన ఇవాళ డిశ్చార్జి కానున్నారు. 

త్వరలో 12 ఏళ్లు పైబడిన వారికి టీకాలు 
 
 ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తామని కోవిడ్‌పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ చైర్మెన్ ఎన్‌కే అరోరా తెలిపారు. 2 నుంచి 17ఏళ్ల వయసువారికి భారత్ బయోటెక్‌‌ తయారుచేసిన కోవ్యాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కోసం కేంద్రం ఇప్పటికే అనుమతులిచ్చింది. మరోవైపు 15 నుంచి 18 సంవత్సరాల వయసువారిలో జనవరి 3 నుంచి మూడున్నర కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.