గుంపులను అదుపు చేయడానికి పెల్లెట్ గన్‌ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పెల్లెట్ గన్‌ల వినియోగానికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఒపి) ఏమిటి? ఏ పరిస్థితుల్లో వీటిని ప్రయోగించవచ్చో వివరించాలని కోర్టు కేంద్రాన్ని కోరింది.
జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో పోలీసుల చర్య సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు వ్యక్తులతో పాటు, మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ యశోవర్ధన్ ఆజాద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్‌ను వినియోగించే అధికారాలు పోలీసులకు ఉన్నాయని తెలిపింది.
ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, జులై 20న జంతర్‌మంతర్‌లో విధుల్లో ఉన్న ఆర్‌ఏఎఫ్ సిబ్బంది ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డులను భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) జారీ చేసిన మార్గదర్శకాలను ధర్మాసనం ప్రస్తావిస్తూ అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్‌ను వినియోగించే అధికారాలు పోలీసులకు ఉన్నప్పటికి, ఈ కేసులో వాటి వినియోగం ఎలా జరిగిందనే అంశాన్ని పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
నీట్ ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లో పెల్లెట్ గాయాలు పొందిన వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించింది.
పౌర జన సమూహాలను నియంత్రించడానికి, చెదరగొట్టడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలు పెల్లెట్ గన్‌లను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థన, అటువంటి ఆయుధాల వాడకాన్ని అనుమతించే పోలీసు నిబంధనలను సవాలు చేయనందున “అస్పష్టంగా” ఉందని ధర్మాసనం పేర్కొంది. పెల్లెట్ గన్‌ల వాడకాన్ని అనుమతించే నిబంధనలను సవాలు చేస్తూ పిటిషన్‌ను సవరించడానికి పిటిషనర్లకు వీలు కల్పించేందుకు ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
“మీరు నిబంధనలనే సవాలు చేస్తే తప్ప, అసాధారణ పరిస్థితులలో పోలీసు నిబంధనలు వాటి వాడకాన్ని అనుమతిస్తాయి. శ్రేణీకృత విధానంలోని దశలలో పెల్లెట్ గన్‌ల వాడకం ఒకటి,” అని జస్టిస్ బాగ్చి తెలిపారు.

More Stories
`వందేమాతరం’ బిల్లుకు లోక్‌సభ కూడా ఆమోదం
పాకిస్థానీ కశ్మీర్ అంటూ ఏమీ లేదు
‘వందేమాతరం’ను అవమానించడం నేరం.. రాజ్యసభలో బిల్లు ఆమోదం