70 శాతం పెద్దలకు రెండు డోసుల టీకాలు 

దేశంలోని పెద్దల్లో 70 శాతం మందికి కరోనాకు పూర్తిగా టీకాలు వేయగా, 93 శాతం మందికి మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. టీకా డ్రైవ్‌ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా దేశీయంగా అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్‌పై పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు టీకాలు వేయడంతో గత సంవత్సరం జనవరి 16 న డ్రైవ్‌ ప్రారంభించామని గుర్తు చేశారు. అత్యధిక జనాభా, అనేక వైవిద్యాలు ఉన్నప్పటికీ 156 కోట్ల డోసుల మైలురాయిని పూర్తి చేయడం భారతీయులకు గర్వకారణమని పేర్కొన్నారు.

దేశం యొక్క కోవిడ్‌ టీకాల డ్రైవ్‌తో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుందని చెప్పారు. ఈ సందర్భంగా టీకా అభివృద్ధిలో భాగస్వాములైన శాస్త్రవేత్తలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ఇలా ఉండగా, భారత్‌లో కరోనా  జోరు కొనసాగుతోంది. కొత్తగా దాదాపు 2.59 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందారు. 

దేశంలో ప్రస్తుతం 16,54,361 యాక్టివ్‌ కేసులున్నాయి. 1,51,740 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 19 శాతానికి కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. దేశంలో ఒమైక్రాన్‌ కేసులు మొత్తం 8,209కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.