గోరఖ్‌పూర్ సిటీ నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ నుండి పోటీచేస్తారన్న ఊహాగానాలకు బిజెపి నేడు ముగింపు  పలికింది. ఆయనను అయోధ్య నుండి పోటీకి  దింపడం ద్వారా హిందుత్వ నినాదంతో ఎన్నికలలో గెలుపొందాలని బిజెపి చూస్తున్నట్లు కొద్దీ రోజులుగా వస్తున్న కథనాలకు చెక్ పెట్టింది.
 
 ఆయన స్వస్థలమైన గోరఖపూర్ సిటీ నుండి పోటీచేస్తారని ప్రకటించడం ద్వారా ఐదేళ్ల తన పరిపాలనను చేప్పించి ఓట్లు కోరనున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. 
యోగి ఆదిత్యనాత్ గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998 నుంచి 2017 వరకు ఐదుసార్లు వరుసగా గెలిచారు. ఆయన శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయన గోరఖ్‌పూర్ సిటీ స్థానం నుంచి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. లుత అయోధ్య ,మధుర.. ఈ రెండింటిలో ఒక చోటనుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.
 శనివారం మధ్యాహ్నం తొలిజాబితాను బిజెపి విడుదల చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈసారి గోరఖ్‌పూర్‌ అర్భన్‌ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. ఇక్కడ మార్చి 3న ఆరో దశలో పోలింగ్‌ జరగనుంది. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్‌ సంబంధిత వివరాలు వెల్లడించారు. అధిష్టానం తుది నిర్ణయం మేరకు ఈ జాబితా విడుదల చేసినట్లు చెప్పారు.
తనకు గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సబ్ కా సాథ్ సబ్‌ కా వికాస్ అనే మంత్రం ఆధారంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. పూర్తి మెజార్టీతో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని యోగి విశ్వాసం వ్యక్తం చేశారు
2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసింది. యోగి ప్రస్తుతం విధాన సభ సభ్యుడు (ఎంఎల్‌సీ)గా ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్‌రాజ్‌లోని సిరతు నుంచి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో మొదటి, రెండో విడత పోలింగ్ జరిగే స్థానాలకు అభ్యర్థులను బీజేపీ శనివారం ప్రకటించింది. మొదటి దశలో 58 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
 కాగా బీజేపీ 57 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో దశలో ఎన్నికలు జరిగే 55 స్థానాలకుగానూ, 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. అదనంగా యోగి, మౌర్య అభ్యర్థిత్వాలను కూడా ప్రకటించింది. ఈ జాబితాలో 63 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని బీజేపీ కార్యకర్తలతో ఈనెల 18న సమావేశమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాత అక్కడి పార్టీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానుండటం ఇదే మొదటిసారి. వర్చువల్ మీట్ ద్వారా కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.