టెస్ట్ కెప్టెన్సీకి కూడా విరాట్ కోహ్లీ రాజీనామా

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని కూడా వదులు కున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ విషయం తెలుపుతూ ఆయన ట్విట్టర్‌లో ఒక మేసేజ్‌ను షేర్ చేశాడు. అంతకు ముందు వన్ డే,  టీ-20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాభవం ఎదురు కావడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

‘‘టీమీండియాను సరి అయిన దిశలో నడిపించడానికి అలుపెరగకుండా 7ఏళ్లు పనిచేశాను. నీతి, నిజాయతీతో నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ప్రతి పనికి ఒక ముగింపు ఉంటుంది. నాకు సంబంధించినంత వరకు టీమీండియా టెస్ట్ కెప్టెన్సీ ఆ ముగింపు అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు అనేక ఆటు పోట్లు ఎదురయ్యాయి. నేను ఎప్పుడు కూడా నమ్మకాన్ని కొల్పోలేదు. ప్రతి పనిలో 120 శాతం ఇవ్వాలని భావించాను. అందుకోసం నిర్విరామంగా పనిచేశాను” అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘

“నా మనస్సు చెప్పింది వినాలనుకుంటున్నాను. నా టీమ్‌తో ఎప్పుడు నిజాయతీగా ఉండాలని భావించాను. నాకు ఇన్ని ఏళ్లు కెప్టెన్సీ అవకాశం ఇచ్చినందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు ధన్యవాదాలు చెబుతున్నాను. నా విజన్‌ని ఆచరణలోకి తీసుకు వచ్చినందుకు టీమ్ మేట్స్‌కు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి రోజు టీమ్‌కు అండగా నేను ఉన్నాను. ఏ సమయంలోను ఓటమిని అంగీకరించలేదు. ఈ ప్రయాణాన్ని టీమ్ మేట్స్ అందరు నాకు తీపి జ్ఞాపకంగా మిగిల్చారు ’’ అని విరాట్  కోహ్లీ చెప్పాడు.

2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతలనుంచి వైదొలగడంతో కోహ్లీ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆపై రెండేళ్లకు పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను కూడా వదులుకోవాలని మహీ నిర్ణయించుకోవడంతో 2017లో విరాట్‌ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కోహ్లీ పగ్గాలు చేపట్టాక అతిపెద్ద టోర్నీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది.

సారథిగా ధోనీకంటే కోహ్లీకే విజయశాతం మెరుగ్గా ఉండడం విశేషం. విరాట్‌ సారథ్యంలో భారత్‌ 45 టీ20 మ్యాచ్‌ల్లో తలపడితే 27 విజయాలు సాధించింది. 2 మ్యాచ్‌లు టై కాగా.. మరో రెండు ర ద్దయ్యాయి. అంటే.. 65.11 శాతం అన్నమాట. విరాట్‌ నాయకత్వంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేకపోయినా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లలో జట్టు సిరీస్‌లు గెలుచుకోవడం విశేషం.

కోహ్లి నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ అతనికి అభినందనలు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా కోహ్లి నిర్ణయం తర్వాత స్పందించారు. ‘టీమిండియా కెప్టెన్‌గా జట్టును ఉన్నతస్థాయికి తీసుకెళ్లావు. స్వదేశంలోనూ , విదేశాల్లోనూ నీ కెప్టెన్సీలో భారత జట్టు బలమైన శక్తిగా ఎదిగింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో నీ సారథ్యంలో సాధించిన విజయాలు ప్రత్యేకం. ఎప్పటికీ మరువలేనివి’ అని జై షా ట్వీట్‌ చేశారు.

మరొకవైపు కోహ్లి ఆకస్మిక నిర్ణయంపై బీసీసీఐ తన ట్వీటర్‌ అకౌంట్‌లో స్పందించింది. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో మైలురాళ్లను అధిగమించడమే కాకుండా, అత్యున్నత స్థాయికి వెళ్లిందని పేర్కొంది. టెస్టుల్లో భారత్‌ తరఫున 68 మ్యాచ్‌లకు కోహ్లి నేతృత్వం వహించగా 40 విజయాలను సాధించిన విషయాన్ని బీసీసీఐ గుర్తు చేస్తూ ట్వీట్‌ చేసింది.