ఉగ్రకుట్ర హెచ్చరికలపై హైదరాబాద్ లో నౌకాబందీ

జనవరి 26న ఉగ్రకుట్ర జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికలతో పోలీసులు పలు ప్రాంతాలలో నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్ట్‌లలో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది.
 
 అనుమానిత వ్యక్తులు, వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఉగ్రమూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పట్టుబడటంతో కేంద్ర నిఘా వర్గాలు దేశవ్యాప్తంగా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలతో పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.

ఇందులో భాగంగా నగరంలోని ఐఎస్‌ఐఎస్, ఉగ్రభావ జాలంపట్ల ఆకర్షితులైన వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని పలు అనుమానస్పద ప్రాంతాలలో పోలీసులు నాకాబందీతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఆధారాలు సేకరించిన అనంతరం సదరు యువకులను అదుపులోకి తీసుకోవాలని అటు ఎన్‌ఐఎ,ఇటు ప్రత్యేక పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

హైదరాబాద్ నగరంలో మాడ్యుల్స్, స్లీపర్ సెల్‌పై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. నగరంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన యువతను ఐసిస్ పట్ల ప్రభావితం చేసేందుకు సామాజిక మాధ్యమాల ఆయుధంగా చేసుకున్నట్లుగా ఎన్‌ఐఎ అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద భావాజాలాలనికి అకర్షితులవుతున్నారనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఉగ్రప్రభావిత ప్రాంతాలలో రహస్యంగా విచారణ చేపడుతున్నారు.

పోలీసులు పాతబస్తీలోని పలు ప్రాంతాలలో కార్డన్ సర్చ్‌లతో పాటు పోలీస్ పికెట్‌లను సైతం ఏర్పాటు చేసింది. ఉగ్రవాద భావాజాలం పట్ల ఆసక్తి చూపుతూ సంబంధిత వ్యక్తులతో సంభాషణలు సాగిస్తున్నారన్న పక్కా ఆధారాలతో ఎన్‌ఐఎ ధికారులు విచారిస్తున్నారన్నది సమాచారం. ఉగ్ర కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.

 తాజాగా కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల కారణంగా హైదరాబాద్‌లోని షాయిన్‌నగర్, పహడి షరీఫ్, అభిన్‌పురాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నగరంలోని స్లీపర్ సెల్, మాడ్యువల్స్ కదలికలపై నిఘా సారిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఐసిస్ పట్ల ఆకర్షితులైన వారి జాబితాను పరిశీలిస్తున్నారు. 

కాగా పాతబస్తీలో కొందరు యువకులు కనిపించకుండా పోగా, అయితే వారిపై పోలీసు స్టేషన్లలో ఏలాంటి కేసులు నమోదు కాలేదు. ఈక్రమంలో అజ్ఞాతంలో ఉన్న వారి పేర్లను సేకరిస్తున్నారు. వీరు ఎక్కడు ఉన్నారు? ఉగ్రవాదం పట్ల ఆకర్షితులై ఆయా సంస్థల్లో పనిచేస్తున్నారా? అన్న కోణంలో ఎన్‌ఐఎ దర్యాప్తు సాగిస్తోంది.

గతంలో సిమిలో పనిచేసిన వారు ఇతర ఉగ్రవాద సంస్థలలో కీలకంగా పనిచేస్తున్నారని ఎన్‌ఐఏ అనుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉగ్రవాద సాహిత్యాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ నగరంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలకు ఉగ్రవాద కార్యకలాపాల వైపుగా మళ్లీంచేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఎన్‌ఐఎ విచారణలో గుర్తించినట్లు సమాచారం.

ఈక్రమంలో కేంద్ర నిఘా వర్గాల ఆదేశాల మేరకు ఎన్‌ఐఎ అధికారులు ఉగ్ర ప్రభావిత రాష్ట్రాలలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఐసిస్ పట్ల అకర్షితులౌతున్న యువతను నియంత్రించేందుకు ఎన్‌ఐఏ తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. భారతదేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన ఆల్‌ఖైదా, ఇండియన్ ముజాహిదీన్, సిమి, చెందిన వారు నగరంలో తలదాచుకున్నారా? అన్న కోణంలో రహస్యంగా దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఆధారాలు లేనిదే అదుపులోకి తీసుకోరాదన్న ఆలోచనతో అనుమానం ఉన్నవారి కదలికలు, వారి కాల్‌డేటాను నిశితంగా గమనిస్తున్నారు. నగరంలో ఉగ్ర కుట్రకు యత్నించే వారికి ఆర్ధికంగా సహకరిస్తున్న స్లీపర్ సెల్, మాడ్యువల్స్‌పై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఐసిస్ పట్ల ఆకర్షితులైన వారి జాబితాను పరిశీలిస్తున్నారు.

ఉగ్ర కుట్ర జరిగే అవకాశం ఉందన్న అనుమానంలో భాగంగా దేశంలోని కేరళ, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎన్‌ఐఎ అధికారులు వివరిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలలోని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.