పండుగ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి

దేశంలో ఒమిక్రాన్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కరోనా నియంత్రణపై అందరూ దృష్టి పెట్టాలని, పండుగ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.  ప్రస్తుత పండగ సీజన్‌లో ప్రజల అప్రమత్తత, నిర్వహణలో ఎలాంటి లోటురాకూడదని
కరోనా తాజా పరిస్థితి, కట్టడిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశంలో  ఈ విపత్తుతో ప్రజలు జీవనోపాధి కోల్పోకూడదని స్పష్టం చేశారు. 
 
దేశంలో 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్‌ పూర్తి చేశామని,  రాష్ట్రాల వద్ద సరిపడా వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ప్రికాషన్‌ డోసులు అందిస్తున్నామని చెబుతూ అవసరమైన వారికి టెలిమెడిసన్‌ ద్వారా సేవలు అందేలా చూడాలని మోదీ తెలిపారు
 
దేశంలో ఇప్పటివరకూ అర్హులైన వారిలో 92 శాతం మందికి తొలి డోసు, 70 శాతం మందికి రెండో డోస్ ఇచ్చామన్నారు. 17 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు వారు 3 కోట్ల మందికి పైగా టీకాలు తీసుకున్నారని ప్రధాని చెప్పారు. సామాన్యుల ఆర్ధిక పరిస్థితులకు విఘాతం కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. 
సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్య వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై కృతజ్ఞతలు తెలియజేశారు. తమ తమ రాష్ట్రాల్లో కరోనా  కొత్త కేసుల తాజా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్, సమస్యలు, సవాళ్ల గురించి ప్రధానితో చర్చించారు.
ముందస్తు, క్రియాశీలక, సామూహిక విధానాలతో కేంద్రం, రాష్ట్రాలు సమష్టిగా వ్యవహరిస్తున్న వ్యూహాలనే కరోనాపై పోరులో కొనసాగించాలని ప్రధాని సూచించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరిస్తూ, నూటికి నూరు శాతం లక్షం సాధించడానికి ‘హర్ ఘర్ దస్తక్’ రీతిలో ముమ్మరం గా కొనసాగించాలని స్పష్టం చేశారు. 
 
కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తి కావస్తోందని గుర్తు చేశారు. సమష్టి ప్రయత్నాలతో 130 కోట్ల మంది భారతీయులు త్వరలో విజయం సాధిస్తారన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఒమిక్రా న్ గురించి మొదట్లో తలెత్తిన సందేహాలు క్రమంగా ఇప్పుడు తొలగిపోతున్నాయని చెప్పారు.
ఇదివరకటి కరోనా వేరియంట్లు కన్నా ఒమిక్రాన్ అనేక రెట్లు వేగంగా విస్తరిస్తోందని ప్రధాని తెలిపారు. మనం అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలని, అది మహమ్మారి కాకుండా చూడాలని ప్రధాని హెచ్చరించారు.
కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ  బెంగళూరు నగరంలో పెరిగిన కేసుల గురించి చెప్పి, నియంత్రణ కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. అలాగే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం కల్గిన పడకల సామర్థ్యాన్ని పెంచినట్టు తెలిపారు. పండుగ సీజన్లో బెంగాల్ రాష్ట్రంలో పెరిగిన కొత్త కేసుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాట్లాడినట్టు తెలిసింది.
తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ కరోనాపై పోరులో కేంద్రంతో కలిసి పోరాడతామని వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ రాష్ట్రంలో ప్రజల్లో నెలకొన్న అపోహలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు ఆయన తెలిపారు.
ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ అందుకోలేని పరిస్థితి లేకుండా చూస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆరోగ్య వసతుల కల్పన కోసం కేంద్రం చేసిన ఆర్థిక సహాయంపై పంజాబ్ ముఖ్యమంత్రి  చరణ్‌జీత్ సింగ్ ఛన్ని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
ముందు జాగ్రత్త డోసు ప్రజల్లో భరోసా తీసుకొచ్చిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కవరేజి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని మణిపూర్ సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.