3 కోట్ల మంది పిల్లలకు మొదటి డోసు టీకా

ఈ నెల 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా  వ్యాక్సిన్ ప్రారంభించగా ఇప్పటివరకు మూడు కోట్ల మందికిపైగా పిల్లలు మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశ యువజనులు ఎంతో బాధ్యతగా, ఉత్సాహంతో వ్యాక్సినేషన్‌లో పాల్గొంటున్నారని ఆయన ప్రశంసించారు.
 
 సాధ్యమైనంత త్వరగా దేశంలోని అర్హులైన యువజనులందరూ వ్యాక్సినేషన్‌లో పాల్గొనాలని ఆయన ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు 26,73,386 మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లకు పైబడిన వారు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 
 
గడచిన 24 గంటల్లో మరో 76 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరగడంతో దేశంలో ఇప్పటి వరకు 154.61 కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సినేషన్ జరిగినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
కాంగ్రెస్ పాదయాత్ర నిలిపివేత 
ఇలా ఉండగా, కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన మేకెదాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే ఇందులో పెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడుతుండడంతో కలకలం రేగుతోంది. 
 
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే , సీనియర్ నేత వీరప్ప మొయిలీ తదితరులకు తాజాగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరు కాక సిద్దరామయ్య, మేయర్ మల్లికార్జున్ తదితరులకు లక్షణాలు బయటపడ్డాయి.
 
 ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా  నిబంధనలు ఉల్లంఘిస్తూ వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొంటుడటంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. బిజెపి నేతలు దీన్ని సూపర్ స్ప్రెడర్ ర్యాలీగా అభివర్ణిస్తూన్నారు.
 
ఈ క్రమం లోనే నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ , రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్యా తదితర 40 మందిపై కేసులు నమోదయ్యాయి. కరోనా దృష్టా ఈ ర్యాలీని వెంటనే ఆపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్‌కు లేఖ రాశారు. ఈ పాదయాత్రకు ఎందుకు అనుమతిచ్చారని, దాన్ని ఆపేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కర్ణాటక హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.