రైతులను మోసగించాలని చూస్తున్న కేసీఆర్ 

రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ   విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని కేసీఆర్ గ్రహించాలని హితవు చెప్పారు. 

 ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి… కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని సీఎం హెచ్చరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సర్వరోగనివారిణి రైతుబంధే అన్నట్టు కరోనా నిబంధనల్ని కాళ్ల కింద వేసి తొక్కి మరీ చారణ కోడికి బారాణ మసాల తీరుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 

రైతు బంధు వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారో రాష్ట్ర రైతాంగానికి తెలపాలని విజయశాంతి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో ఓ యువ రైతు రుణమాఫీ చేయకపోవడంతోనే తన భూమి అమ్ముకున్నానని నిరసన తెలుపుతుంటే అధికారపార్టీ నేతలు అడ్డుకొని కొట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు.