సింగరేణి తెలంగాణదే… తేల్చి చెప్పిన కేంద్రం 

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాటాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య జరిగిన వాదనలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలంగాణ వాదనలోనే బలముందని, తెలంగాణ వాదన చట్టబదద్దంగా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 

తెలుగు రాష్ట్రాల విభజన వివాదాలను పరిష్కరించడానికి బుధవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బృందం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అధికారుల బృందం పాల్గొంది. 

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటాలున్నాయేగానీ ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది విభజన చట్ట ప్రకారమే ఉన్న నిబంధనని, దీనిపై ఏపీ ప్రభుత్వం అడ్డంతిరిగి వాదించడంలో అర్ధంలేదని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎస్ వాదనలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి  అజయ్‌భల్లా కూడా అంగీకరించి తెలంగాణ వాదనలోనే వాస్తవముందని తేల్చి చెప్పారు. 

సింగరేణి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తే ఎలాంటి అభ్యర్ధనను కూడా స్వీకరించ కూడదని తెలంగాణ సీఎస్ కోరగా అందుకు హోంశాఖ కార్యదర్శి అంగీకరించినట్లు తెలిసింది. అంతేగాక సింగరేణి కాలరీస్‌కు అనుబంధంగా ఉన్న ఏపీహెచ్‌ఎంఈఎల్ (ఆప్మెల్) యాజమాన్యానికి సంబంధించిన సమస్యపైన కూడా తెలంగాణ సీఎస్ గట్టిగా పట్టుబట్టారు. 

భవష్యత్తులో కూడా ఆప్మెల్ తెలంగాణకే కొనసాగుతుందని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టంచేశారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఎనిమిది కీలకమైన అంశాలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్ళగా ఏపీ ప్రభుత్వం కూడా తొమ్మిది అంశాలపై తమ వాదనలను వినిపించింది. 

విభజన వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలున్నప్పటికీ కోర్టులను ఆశ్రయించి స్టే ఆర్డర్‌లు తెచ్చుకోవడంతో ఈ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని కూడా తెలంగాణ సీఎస్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళారు. 

ఇలా ఇరు పక్షాల నుంచి తీవ్రస్థాయిలో వాదోపవాదాలు విన్న తర్వాత ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళతానని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఇద్దరు ప్రధాన కార్యదర్శులకు వివరిస్తానని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా హామీ ఇచ్చారు.

విభజన వల్ల అన్ని విధాల నష్టపోయన తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కోరగా, విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పలు కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

చట్టంలో ప్రస్తావించని సంస్థలు, బకాయిల కోసం విభజన చట్టాన్ని మరోసారి సవరించాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. దీంతో తాము నష్టపోతున్న మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలని ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. దాఖలు చేశాయని, ఈ బకాయిల మొత్తాలను తేల్చుకునేందుకు వీలుగా కేసులు ఉపసంహరించుకోవాలని తాము కోరినట్లుగా తెలంగాణ సీఎస్ వివరించారు.