అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్ పోటీ!

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని బిజెపి కోర్ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యుపిలో టికెట్ల కేటాయింపుపై మంగళవారం ఢిల్లీలో బిజెపి కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ కమిటీలో యోగి కూడా సభ్యుడే. 

యోగి అభ్యర్థిత్వంపై కోర్ కమిటీ చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అభ్యర్థిని ఎక్కడ నిలపాలన్నదానిపై బిజెపి ఎన్నికల కమిటీదే తుది నిర్ణయమని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర యూనిట్ సిఫారసులను పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

అయోధ్యలో రామాలయం నిర్మించడానికి సానుకూలంగా 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బిజెపికి ఆ స్థానం కీలకంగా మారింది. రామాలయం నిర్మాణం కోసం దేశవ్యాప్త రథయాత్ర (ఎల్‌కె అద్వానీ నేతృత్వంలో) చేపట్టిన తర్వాతే బిజెపి బలోపేతమైన విషయం రాజకీయ పరిశీలకులకు తెలిసిందే. 

1990ల నుంచి యుపిలో బిజెపి బలమైన పార్టీగా వేళ్లూనుకున్నది. మధ్యలో ఎస్‌పి, బిఎస్‌పిల కూటమి, ఇతర కూటములు అధికారం చేపట్టినా బిజెపికి యుపి వెన్నెముకగా నిలిచింది. హిందూ మతస్థుల్ని ప్రభావితం చేయాలంటే యోగిని అయోధ్య లేదా మథుర నుంచి బరిలోకి దించాలని ఆ రాష్ట్ర నేతలు కోరుతున్నారు. 

గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన యోగిని అయోధ్య నుంచి బరిలోకి దించడం ద్వారా హింతూత్వ, అభివృద్ధి నినాదాలతో తిరిగి అధికారం చేపట్టవచ్చునని ఆ వర్గాలు సూచిస్తున్నాయి. గోర్‌ఖ్‌పూర్‌మఠ్‌కు అధిపతిగా పని చేసిన చరిత్ర యోగికి ఉన్నది. మథుర నుంచి బరిలోకి దించాలని రాజ్యసభ సభ్యుడు హర్‌నాథ్‌యాదవ్ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు.

ఇద్దరు ఎమ్యెల్యేలు బీజేపీలో చేరిక 
మరోవంక,  ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైని, సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ బుధవారం బిజెపిలో చేరారు. వీరిద్దరి చేరికతో రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామాతో ఎదురుదెబ్బను చవిచూసిన యుపి బిజెపికి కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. 
 
వెనుకబడిన వర్గాలకు చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు సమాజ్‌వాది పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధర్మపాల్ సింగ్ కూడా  యుపి ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 
 
ఇలా ఉండగా, ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బిజీగా ఉన్నారు. మొదటి దశలలో జరిగే ఎన్నికలకు సంబంధించి బిజెపి అభ్యర్థుల పేర్ల జాబితాకు తుది రూపం ఇవ్వడంలో ఆయన పార్టీ కేంద్ర నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
403 స్థానాలున్న యూపీ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.