యువతకు కొత్త మంత్రం ‘పోటీ పడటం, జయకేతనం ఎగురవేయడం’

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ‘పోటీ పడటం, జయకేతనం ఎగురవేయడం’ అనే కొత్త మంత్రాన్ని యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్భోధించారు. పుదుచ్చేరిలో స్వామి వివేకానంద జయంత్యుత్సవాలను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంబహిస్తూ   దీనిని అనుసరిస్తూ బలమైన దేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. 

ప్రాణత్యాగాలు చేసినప్పటికీ గుర్తింపు పొందలేకపోయిన స్వాతంత్య్ర  సమర యోధుల జీవితాలపై పరిశోధన చేయాలని, వారి చరిత్రలను రాయాలని కోరారు. యువత సమైక్యంగా నిలవాలని, యుద్ధాలను గెలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్ పోటీల్లో భారతీయుల ప్రతిభను ప్రస్తావించారు. 

ఆత్మ విశ్వాసంతో మునుపెన్నడూ లేనివిధంగా పతకాలను సాధించారని ప్రధాని కొనియాడారు. టీకాకరణ కార్యక్రమంలో యువత భాగస్వాములవుతున్నారని, ఇది వారికిగల గెలవాలనే తపనకు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే భావనకు నిదర్శనమని తెలిపారు.  వారికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని, అవసరమైన వనరులను సమకూర్చుతోందని చెప్పారు.

‘శ్రేష్ఠ భారత్, ఒకే భారత దేశం’కు గొప్ప ఉదాహరణ పుదుచ్చేరి అని తెలిపారు. యువత నేర్చుకోవడానికి ఇక్కడ చాలా ఉందని పేర్కొన్నారు. భారత దేశ జనాభా పడుచుదనంలో ఉందని, భారత దేశ మనసు కూడా యవ్వనంలో ఉందని చెప్పారు. నేడు ప్రపంచం ఎన్నో ఆశలతో భారత దేశంవైపు చూస్తోందని, భారత దేశాన్ని రేపటి గళంగా పరిగణిస్తోందని గుర్తు చేశారు. 

భారత్ ఆలోచనలు, చైతన్యం కూడా యవ్వనంలో ఉన్నట్లు ప్రధాని తెలిపారు. భారత దేశ యువత జనాభాపరమైన లాభాంశమని చెప్పారు. దేన్నైనా సాధించగలమనే స్ఫూర్తి, చైతన్యం నేటి యువతకు ఉన్నాయని, ఇది ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.

పుదుచ్చేరి ఆధ్యాత్మిక, సాహిత్య చరిత్రలో ప్రముఖులైన శ్రీ అరబిందో 150వ జయంతి, మహాకవి సుబ్రహ్మణ్య భారతి 100వ జయంతి సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత దేశ యువతకు శ్రమించే తత్వం ఉందని భరోసా వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు గురించి స్పష్టత ఉందని తెలిపారు. పాత మూస పద్ధతుల భారాన్ని వారు మోయబోరని పేర్కొన్నారు.

కొత్త సవాళ్ళ ఆధారంగా పరిణామం చెందుతారని చెప్పారు. గతంలో దేశానికి స్వాతంత్ర్యం రావాలనే ఆకాంక్షతో ప్రాణత్యాగాలు చేసేవారని, ఇప్పుడు అలా కాకుండా దేశం కోసం జీవించాలని అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుల కలలను నెరవేర్చాలని కోరారు. మన యువత ప్రపంచ సౌభాగ్య స్మృతిని లిఖిస్తున్నారని కొనియాడారు.

11 వైద్య  కళాశాలలు ప్రారంభించిన మోదీ

తమినాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వీటితో పాటు చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ అనే కొత్త క్యాంపస్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం మోదీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంపొందించడం, తమిళనాడు ప్రజలకు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు.

విరుధునగర్, నమక్కల్, ది నిల్‌గిరీస్, తిరుప్పూర్, తిరువల్లూరు, నాగపట్టణం, దిండిగుల్, కల్లకురిచి, అరియలూరు, రామంతపురం, క్రిష్ణగిరి జిల్లాల్లో ఈ నూతన మెడికల్ కాలేజీలను నిర్మించారు. రూ.4వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాల కోసం రూ.2,145 కోట్లను కేంద్రం ఇవ్వగా, మిగిలిన మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం భరించింది. 

సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం కొంద ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 1450 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ అనే కొత్త క్యాంపస్‌‌ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 24 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.