`కాశీ’  సిబ్బందికి ప్రధాని ప్రధాన  ఊహించని బహుమతి

కాశీలోని విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఊహించని బహుమతి పంపించారు. అక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికుల కోసం జూట్‌తో (జనపనార) తయారు చేసిన 100 జతల చెప్పులను పంపించారు.
 
 ప్రధాని మోదీ తమకు పాదరక్షలను పంపడంపై కాశీ విశ్వనాథ్ ధామ్ పూజారులు, సిబ్బంది, సేవకులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదల పట్ల  మోదీకున్న శ్రద్ధకు ఇది నిదర్శనమంటున్నారు. కాగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ ప్రాంగణంలో పూజారులు, పని చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు ఇలా ఎవరైనా రబ్బరు, తోలు చెప్పులు ధరించి తిరగడం నిషిద్ధం. 
 
ఈ క్రమంలో ఇటీవల కాశీని సందర్శించిన మోదీ అక్కడ చాలామంది పూజారులు, సిబ్బంది, పారిశద్ధ్య కార్మికులు కాళ్లకు చెప్పులు లేకుండా అభివృద్ధి పనుల్లో పాల్గొనడాన్ని గమనించారు. ఈ  క్రమంలో చలికాలంలో కాళ్లకు చెప్పులు లేకుండా వారు ఇబ్బందులు పడుతుండడం చూసి మోడీ చలించిపోయారు. 
 
అయితే గుడిలో లెదర్‌, రబ్బరుతో చేసిన జోళ్లు ధరించడం నిషిద్ధం కాబట్టి  జనపనారతో చేసిన 100 చెప్పుల జతలను కాశీకి పంపించారు. ఆలయ అధికారులు వీటిని కార్మికులకు పంపిణీ చేశారు.  మోదీ ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్‌లో చాలా సేపు గడిపారు.  అక్కడి సిబ్బంది, సేవకులతో కలిసి ఫోటోలు దిగి, సహపంక్తి భోజనాలు కూడా చేశారు.