ఆసుపత్రిలో చేరేవారు 5 – 10 శాతం ఉండవచ్చు 

దేశంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా అమాంతం పెరుగుతున్నాయి. రెండో  వేవ్‌లో పదివేల నుండి కేసులు లక్ష చేరేందుకు 100 రోజులు పడితే, మూడో  వేవ్‌లో పదిరోజుల్లో లక్షకు చేరుకున్నాయని కేంద్రం పేర్కొంది. మరోవైపు మూడో వేవ్‌లో ఆస్పత్రిలో చేరేవారి రేటు (హాస్పిటలైజేషన్‌) 5-10 శాతం మధ్య ఉండవచ్చని కేంద్రం హెచ్చరించింది. 

రెండో వేవ్‌లో ఈ రేటు 20-30 శాతం ఉందని తెలిపింది. ప్రస్తుత వైరస్‌ పరిస్థితి క్రియాశీలక, వ్యాప్తి చెందే దశలో ఉందని, దీంతో ఆస్పత్రిలో చేరేవారి రేటు పెరగవచ్చని హెచ్చరించింది. సోమవారం 1.79 కేసులు నమోదవగా, రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. పది రోజుల క్రితం దేశంలో రోజువారీ కేసులు సగటున 10 వేలు -15 వేల మధ్య ఉండేవి. 

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌, కొనసాగుతున్న డెల్టా వేరియంట్‌లతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వ్యాప్తి చెందడంతో రోజురోజుకి అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, పెరుగుతున్న కేసులకి సరిసమానంగా ఆస్పత్రుల  పడకలను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

రెండో ఉధృతి సమయంలో జరిపిన రోజువారీ పర్యవేక్షణ, సమీక్షలను తిరిగి నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు, సిబ్బంది అవసరాన్ని ఎప్పటికపుడు సమీక్షించాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్న వైద్య సదుపాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 

ఈ నెల 9న కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన సూచనలను కఠినంగా అనుసరించాలని రాష్ట్రాలను ఆదేశించారు. అవసరమైతే రిటైర్డ్ వైద్యులు, ఎంబిబిఎస్ విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. టెలీకమ్యూనికేషన్ సేవలతోపాటు సామాజిక కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు వారిని వినియోగించుకోవాలన్నారు. పేషెంట్ల తరలింపునకు అదనపు అంబులెన్స్‌లు లేదా ప్రైవేట్ వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు.

నెలాఖరుకు గరిష్ట స్థాయికి 

జనవరి నెలాఖరు వరకు దేశంలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఐటి కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ వెల్లడించారు. పీక్‌ సమయంలో నమోదయ్యే కేసులు.. సెకండ్‌ వేవ్‌ ఉధృత దశలో బయటపడిన కేసుల సంఖ్యనూ మించే అవకాశమున్నదని తెలిపారు. వారానికి సగటున నాలుగు నుంచి ఎనిమిది లక్షల కేసులు వస్తాయని అంచనా వేశారు. కేసుల తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఒకవేళ జనవరి చివర్లో గరిష్ట స్థాయి నమోదైతే.. మార్చి మధ్య నాటికి ఈ వేవ్‌ ముగుస్తుందని చెప్పారు.

మహానగరాల్లో కరోనా పరిస్థితులపై ప్రొఫెసర్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఢిల్లీలో జనవరి మధ్య నాటికి గరిష్ట స్థాయి నమోదయ్యే అవకాశమున్నదని తెలిపారు. ఆ సమయంలో రోజుకు దాదాపు 40 వేల కేసులు బయటపడతాయని అంచనా వేశారు. ముంబయి, కోల్‌కతాలోనూ ఈ నెల మధ్యనాటికి గరిష్ట కేసులు వచ్చే అవకాశమున్నదని చెప్పారు.

ఎన్నికల ర్యాలీలపై మాట్లాడుతూ.. ”కేవలం ఈ కార్యక్రమాలను మాత్రమే వైరస్‌ వ్యాప్తికి కారణంగా భావిస్తే.. అది తప్పు. ఇందుకు అనేక కారణాలూ ఉన్నాయి. అందులో ఈ ర్యాలీలూ ఒకటి. వీటిని నిరోధించడం ద్వారా.. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలమనుకోవడం కరెక్ట్‌ కాదు” అని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తిని ట్రాక్‌ చేసే ‘సూత్ర కంప్యూటర్‌ మోడల్‌’కు అగర్వాల్‌ నేతత్వం వహిస్తున్నారు.