దేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు పంపిణీ

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ ను వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్ (ముందు జాగ్రత్త) డోసు పంపిణీని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్​లైన్​ వర్కర్లు, 60 ఏళ్లుపైబడి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రికాషన్​ డోసు వేస్తున్నారు.

 ఈ టికా కోసం శనివారం సాయంత్రం నుంచే కొవిన్ పోర్టల్ లో ఆన్ లైన్ అపాయింట్ మెంట్ ను ప్రారంభించారు. కేంద్ర జారి చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఈ డోసుకు అర్హులైన వారు తొలి రెండు డోసులు తీసుకున్న 9 నెలల తరువాత ప్రికాషన్​ డోసు కింద గతంలో తీసుకున్న వ్యాక్సిన్​నే ఇవ్వనున్నట్లు వెల్లడించిన కేంద్రం సూచించింది. 

కొవాగ్జిన్​ తీసుకున్న వారికి కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ తీసుకున్నవారికి కొవిషీల్డ్​నే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అంచనాల మేరకు.. 1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల ఫ్రంట్ లైన్ వర్కర్లు, 2.75 కోట్ల సీనియర్ సిటిజన్లు ఈ డోసును పొందనున్నారాని, ఇప్పటికే వీరికి ప్రికాషన్ డోసు గురించి మెసేజ్ లు పంపినట్టు కేంద్ర ఆరోగ్యశఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ నిన్న ట్విటర్ లో వెల్లడించారు.

ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, పంజాబ్​, మణిపుర్, గోవాలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందిని ఫ్రంట్​లైన్ వర్కర్లుగా గుర్తించి వారికి ప్రికాషన్ డోసు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కొవిడ్​-19 ప్రికాషన్​ డోసు పొందాలనుకుంటున్న లబ్ధిదారులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న అర్హులైన వారు నేరుగా వ్యాక్సినేషన్​ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది.