చంద్రుని ఉపరితలంపై మొదటిసారిగా నీటి జాడలు

చైనాకు చెందిన చాంగే5 వ్యోమనౌక చంద్రుని ఉపరితలంపైని శిలల్లో నీటి ఆనవాళ్లను మొట్టమొదటిసారి కనుగొన గలిగింది. చంద్రునిపై జరుగుతున్న పరిశోధనల్లో ఇదో మేలి మలుపు. ఈ అధ్యయనం జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో వెలువడింది. 

చాంగే 5 వ్యోమనౌక చంద్రునిపై దిగిన చోట ఉపరితలంపై టన్ను మట్టికి 120 గ్రాముల ( మిలియన్‌కు 120 భాగాలు అంటే పిపిఎం ) వంతున నీటి జాడ ఉన్నట్టు కనుగొన గలిగింది. అక్కడి శిలలో 180 పిపిఎం వంతున నీటి జాడలను గమనించింది. ఆ ప్రాంతం నేల పొరలు కన్నా పొడిగా ఉన్నాయి. 

చంద్రునిపై నీటి ఉనికి ఉన్నట్టు నిర్ధారణ అయినా శిలలు, మట్టిలో కూడా నీటి ఆనవాళ్లను మొట్టమొదటి చాంగె 5 ల్యాండర్ కనుగొనగలిగింది. దాదాపు మూడు మైక్రో మీటర్ల పరిమాణంలో నీటి అణువులు విస్తరించి ఉన్నాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు అంచనా వేశారు. 

సౌర గాలులు తీసుకొచ్చిన హైడ్రొజన్ వల్ల చంద్రుని ఉపరితలం తేమగా తయారై నీటి ఆనవాళ్లు ఏర్పడడానికి దోహదపడిందని పరిశోధకులు చెప్పారు. ఆ శిల లోని అదనంగా 60 పిపిఎం నీటి పరిమాణం చంద్రుని అంతర్భాగం నుంచి వచ్చి చేరిందని తెలిపారు.

అయితే ఆ శిల ఎక్కడ నుంచి వచ్చిందన్న కోణంలో పరిశోధన జరపగా, ప్రాచీన అగ్నిపర్వత శిలగా భావిస్తున్నారు. ఆ శిలనే లూనార్ ల్యాండర్ సేకరించ గలిగింది. చంద్రుని ఉపరితలంపై ఇదివరకు ఉండే నీటి కొలను లోని వాయువు పూర్తిగా ఆవిరి కావడంతో ఒక నిర్దిష్ట కాలంలో చంద్రుని ఉపరితలం పూర్తిగా పొడిగా మారిందని పరిశోధకులు అంచనా వేశారు.

చాంగే 5 వ్యోమనౌక చంద్రుని మధ్య అధిక అక్షాంశం లోగల నవీన రాళ్ల ప్రాంతంలో దిగింది. అక్కడే నీటి పరిమాణాన్ని లెక్కగట్టి 1731 గ్రాముల బరువు ఉన్న నమూనాలను పంపించింది. ఈ పరిశోధనలు చైనా చాంగె 6, చాంగె 7 మిషన్లకు ఎంతో ఆధారాలుగా నిలుస్తాయి. రాబోయే దశాబ్దాలలో మానవ నివాసాలకు దోహదం చేస్తాయి.