సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉధృతం

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఆందోళనలు చేపడితే చర్యలు తప్పవని ప్రభుత్వం నుంచి హెచ్చరికలు జారీ అయినప్పటికీ, ఉద్యోగ సంఘాలు కార్యాచరణను ప్రకటించాయి.  ప్రొబేషన్‌ను డిక్లేర్‌ చేయకపోవడంతో  ప్రభుత్వ అధికారిక సోషల్‌ మీడియా గ్రూపుల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేబడుతున్నారు.
 
 సచివాలయ ఉద్యోగాలను ప్రకటించినప్పుడు రెండేళ్లకు రెగ్యులర్‌ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, రెండేళ్ల నాలుగు నెలలు దాటినా, జూన్‌లో ప్రొబేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని వేతనంతో కుటుంబాలను పోషించుకోలేనిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా, తమ పట్ల వివక్ష చూపుతున్నారని వాపోతున్నారు. 
 
తమ బాధను ప్రభుత్వానికి తెలియజేసే ఉద్దేశంతోనే అన్ని వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల నుంచి వైదొలిగినట్లు పలు సంఘాల నాయకులు తెలిపారు. తొలుత విధులకు హాజరుకాకూడదని భావించగా, తర్వాత శాంతియుత విధానంలో నిరసనలు తెలపాలని అన్ని సంఘాలు నిర్ణయించాయి. 
 

సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ను డిక్లేర్‌ చేయడంతోపాటు పే స్కేల్‌ను ఖరారు చేయాలంటూ అన్ని మండలాల ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లకు వినతిపత్రాలను అందజేయాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య నేతలు   పిలుపునిచ్చారు. ప్రొబేషన్‌ను మరో ఆరు నెలలు పొడిగించడం వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బంది పడతాయని పేర్కొన్నారు.

 

అన్ని గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. అనంతరం అక్కడే నిరసనలు తెలియజేస్తున్నారు.  మధ్యాహ్నం ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లకు, ఆ తర్వాత కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు కూడా వినతిపత్రాలు అందజేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై సంఘాలతో సమావేశం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ను సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 
 
ఆయన సెలవును రద్దు చేసుకుని విజయవాడలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం మూడు గంటలకు అన్ని సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే అజయ్ జైన్‌ సమావేశానికి హాజరవుతామని సంఘాల నాయకులు తెలిపారు.