ఏపీలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ

ఏపీలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ
కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో  రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కరోనా  పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు.
భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని,  మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని స్పష్టం చేశారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కరోనా  ఆంక్షలు పాటించేలా చూడాలని అధికారులకు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని…అలాగే  మాస్క్‌ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.  కరోనాలో ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలని చెప్పారు.  వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలని సూచనలు చేశారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని చెప్పారు.  అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్న ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలని, ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.