కరోనా నీడలో ర్యాలీలు, రోడ్ షో లు వద్దు 

దేశంలో కరోనా మహమ్మారి ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపడానికి ఎన్నికల కమీషన్ సంసిద్దమవుతూ ఉండడంతో  నేషనల్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలకమైన సూచన చేశారు. 
 
ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడం సరికాదని ఎన్నికల కమిషన్ కు సూచించారు. ఈ తరుణంలో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడంపై పునరాలోచించాలని కోరారు.
దేశంలో ఒకవైపు కరోనా కేసులు ఎక్కువవుతుండటం, ఒమిక్రాన్ భయాందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవాలలో  అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉపందుకొంటూ ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. 
 
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జాగ్రత్త చర్యలు అవసరమని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పాల్ స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలో ప్రచారాలు వద్దని వారించడం అంటే పార్టీల హక్కులను హరించినట్లు అవుతుందని ఎన్నికల కమీషన్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.  ఈ విషయంలో పార్టీలే స్వచ్ఛందంగా ప్రచార ర్యాలీలు, సభలను తగ్గించుకోవాలని ఈసీ సూచించినట్లు తెలుస్తోంది.
 
ఈ ఐదు రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులతో సమీక్షించింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలను, అర్హులైన ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయవలసిన ఆవశ్యకతను ఎన్నికల సంఘం చర్చించింది. 
 
ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిస్థితిని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో విడిగా సమావేశమై ఎన్నికల సంఘం చర్చించింది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలకు సంబంధించిన పోల్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో విడుదల చేయనున్నది.
ఎన్నికలు సమీపిస్తుండడంతో వ్యాక్సినేషన్ జోరు పెంచాలని ఇదివరకే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ ప్రభుత్వాలను ఈసీ కోరింది. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.
కరోనా నేపథ్యంలో ఈసీ కూడా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఉద్యోగులను పెంచడం, పూర్తిగా టీకాలు తీసుకున్న అధికారులను నియమించడం, పోలింగ్ కేంద్రాలను పెంచడం వంటివి చేయాలని నిర్ణయించింది.