విదేశీ ప్రయాణీకులకు వారం రోజుల హోం క్వారంటైన్‌

ఒమిక్రాన్‌ ఉధృతి కారణంగా విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకులు ఇకపై వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగానే ముప్పు ఎక్కువ ఉన్న దేశాల నుండి భారత్‌కు వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. 

ఎనిమిదో రోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

తాజా మార్గదర్శకాలు 

* విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ను నింపాలి.
*సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌లో పూర్తి సమాచారం ఇచ్చిన వారినే విమానంలోకి ఎక్కేందుకు అనుమతించాలి.
*ప్రయాణికులు తప్పనిసరిగా తమ ప్రయాణానికి ముందు(72 గంటలు దాటకూడదు) ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి.
*’ముప్పు ఉన్న’ దేశాల నుంచి వచ్చే వారికి.. భారత్‌ చేరుకున్న తర్వాత కరోనా పరీక్షలు ఉంటాయన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు తెలియజేయాలి.
*ఈ పరీక్షల కోసం ప్రయాణికులు ముందుగానే ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు.
*’ఎట్‌ రిస్క్‌’ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఆ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
*ఇక, పాజిటివ్‌ వస్తే వారు ప్రొటోకాల్స్‌ ప్రకారం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉండాలి. వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.
– ‘వీరిలో నెగెటివ్‌ వచ్చిన ప్రయాణికులు కూడా 7 రోజుల పాటు హౌం క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. వీరు కూడా తమ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
*ఒక వేళ పాజిటివ్‌ వస్తే.. వీరి శాంపిల్స్‌ను కూడా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.

ఇటలీ విమానంలో 170 మందికి పైగా కరోనా 

ఇటలీ నుండి వచ్చిన మరో విమానంలో 170 మందికి పైగా కరోనా సోకడం కలకలం రేపింది. ఇటీవల వచ్చిన తొలి విమానంలో 125 మంది కరోనా బారిన పడ్డారు.  తాజాగా  శుక్రవారం ఇటలీలోని రోమ్ నగరం నుండి 290 మంది ప్రయాణీకులతో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు విమానం చేరుకోగా, ఆ తర్వాత చేపట్టిన పరీక్షల్లో 173 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. 

వీరందరినీ ప్రోటోకాల్‌ ప్రకారం నగరంలోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులకు తరలించారు. కాగా, ఇటలీని ‘ఎట్‌ రిస్క్‌’ దేశంగా పరిగణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.