సీఎం గెహ్లాట్‌, కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్ లకు కరోనా

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌,  కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్, టిఎంసి ఎంపి, బెంగాలీ నటి మిమి చక్రవర్తిలతో సహా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. 
 
 తనకు”చాలా తేలికపాటివి” కోవిడ్ లక్షణాలు ఉన్నాయనిఅశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఈ రోజు తనను సంప్రదించిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా 2021 ఏప్రిల్‌లో భారతదేశంలో కరోనా వైరస్ రెండవ వేవ్‌ వచ్చినప్పుడు గెహ్లాట్‌కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
 
కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్ సైతం కరోనా బారిన పడ్డారు. ‘ `నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. కొన్ని రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని’ మనవి అని ట్వీట్‌ చేశారు. 
 
కాగా, ఆయన బుధవారం సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డులను అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఆర్‌పిఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌, ఐటిబిపి, సిఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బి చీఫ్‌లు హాజరుకావడం గమనార్హం. మరోవంక కరోనా పరీక్షలు చేసుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణైందని మిమి చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్యుల సలహా తీసుకుంటున్నట్లు తెలిపారు.
గత కొద్ది రోజులుగా తాను ఇంట్లో నుండి బయటకు రావడం లేదని, ఎవరినీ కలవడం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని ఆమె సూచించారు.
 
ఇలా ఉండగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,17,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 302 మంది మృతి చెందారు. 30,836 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కు చేరింది. 
 
కరోనా రోజువారీ  పాజిటివిటీ రేటు 7.74 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 3,43,71,845 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,83,178కి చేరింది.