ఉద్యోగులు కాస్త తగ్గాలి.. పిఆర్‌సి సంగతి తేల్చని జగన్

ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి గురువారం నిర్వహించిన చర్చలు  అసంపూర్తిగానే ముగిశాయి. వేతన సవరణ (పీఆర్‌సీ)పై ఉద్యోగులు తమ అంచనాలను కాస్త తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి  స్పష్టం చేశారు.  తెలంగాణతో పోల్చుకోవద్దని.. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని హితవు పలికారు. రెండు, మూడ్రోజుల్లో పీఆర్‌సీపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. 
 
మోయలేని భారమైతే కష్టమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వ పరిమితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలని ఉద్యోగసంఘాల నేతలు కోరారు. 
 
‘తెలంగాణతో పలుమార్లు పోలిక వస్తోంది. అక్కడ వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ. 2,37,632 కాగా, ఏపీలో అది రూ.1,70,215 మాత్రమే’ అంటూ ప్రశ్నించారు.  ప్రతి ఏటా ఆదాయాలు పెరుగుతుంటాయని.. రాష్ట్రానికి కనీసం 15 శాతం పెరిగేదని.. కానీ గత రెండేళ్లుగా ఆదాయం పెరిగిందా అని ఆలోచన చేయాలని కోరారు. పెరగకపోగా.. తగ్గాయని చెప్పారు.
 
పిఆర్‌సి, ఇతర అంశాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రెండు నెలలుగా ఆందోళన చేతున్న ఉద్యోగ సంఘాల నాయకులతో  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమావేశమైనారు. ఈ సవవేశంలో నాలుగు జెఎసిలకు సంబందించి నలుగురు బాధ్యులకే మాట్లాడే అవకాశం ఇచ్చారు. 
 
‘ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తాను. ఇది నా హామీ. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తాం. మీతో సమావేశానికి ముందు పలు దఫాలుగా అధికారులతో మాట్లాడాను. కమిటీ చెప్పినట్లుగా 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై పడే భారం రూ.7,137 కోట్లు. ఇది వాస్తవం’ అని జగన్ తెలిపారు. 
 
 పైగా,ఇచ్చిన డీఏలు కూడా ఉద్యోగులకు అందాలి. ఫిట్‌మెంట్‌ ఇచ్చే సమయానికి డీఏలు కూడా క్లియర్‌ కావాలని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నానని,  అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తానాని,  మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.
 
ఎపిఎన్‌జిఓ, జెఎసి అమరావతి నాయకులు బండి శ్రీనివాసరావు, బప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటేరియట్‌ ఉద్యోగ సంఘం నాయకులు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు కె.ఆర్‌.సూర్యనారాయణ మాట్లాడినట్లు తెలిసింది. 34 శాతం ఐఆర్‌ ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి కోరగా, కనీసం 27 శాతమైనా ఇవ్వాలని మిగిలిన సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. 
 
దాన్ని కూడా 2019 జులై నుండి అమలు చేయాలని, హెచ్‌ యథావిధిగా ఉంచాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు ఎంతో చేయాలని ఉందని, మంచిచేయడమే తన ఉద్దేశ్యమని చెప్పారు. 
ఏపీకి కేంద్రం రూ.1.438.08 కోట్లు 
 
 కాగా, కేంద్ర ఆర్థిక శాఖ రెవిన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.438.08 కోట్లు నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ సహా 17 రాష్ట్రాలకు గురువారం రూ.9,871 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి రూ.1,438.08 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.