కుప్పంను వీడే ప్ర‌స‌క్తే లేదు – చంద్ర‌బాబు స్పష్టం

తాను కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలిపెడుతున్నాన‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. తాను ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు కొనియాడారు. 

అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బను తనకు తగిలిన దెబ్బగానే భావిస్తా అని చెప్పారు. ప్ర‌జా స‌మ‌స్య‌లను నేరుగా తెలుసుకునేందుకు కుప్పం ప‌ర్య‌ట‌న‌కి వ‌చ్చాన‌ని చంద్ర‌బాబునాయుడు వెల్ల‌డించారు. కుప్పంలో మూడు రోజుల పర్యటనకు చంద్ర‌బాబు గురువారం వచ్చారు.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో, ముఖ్యంగా కుప్పం మునిసిపల్ ఎన్నికలో టిడిపి ఘోరంగా పరాజయం చెందడం, వైసిపి ఘన విజయం సాధించడంతో వచ్చే ఎన్నికలలో 1989 నుండి గెలుస్తూ వచ్చిన కుప్పంలో చంద్రబాబునాయుడును  సహితం ఓడిస్తామని అధికారపక్ష నేతలు చెబుతూ వస్తున్నారు. 

‘మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయామని వైసిపి నాయకులు నన్ను వేరే ప్రాంతం చూసుకోవాలని చెబుతున్నారు.. నా ప్రాణం ఉన్నంత వరకూ ఇక్కడి నుంచే పోటీ చేస్తా…’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, 40 సంవత్సరాల నా రాజకీయంలో వైసిపి లాంటి నేతలను ఎక్కడా చూడలేదని విమర్శించారు. 

రెండేళ్ళ తరువాత టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు తోక కట్‌ చేసి సున్నం పూస్తామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి డబ్బును గత ఎన్నికల్లో పంచారని, పార్టీ ప్రక్షాళన కుప్పం నుంచే ప్రారంభిస్తానని పేర్కొన్నారు. కోవర్టులను దగ్గర చేర్చేది లేదని, తనను నమ్ముకున్నవారికి అండగా ఉంటానని చెప్పారు. 

కార్యకర్తలకే అన్ని అవకాశాలు కల్పిస్తానని భరోసానిచ్చారు. అధికారం కోసం తల్లిని, చెల్లిని రాజకీయంగా వాడుకొని..ఇప్పుడు వారిని పక్కకు నెట్టిన జగన్‌ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు.