అమరావతి కార్పొరేషన్ ను వ్యతిరేకిస్తున్న గ్రామస్థులు  

మూడు రాజధానుల పేరుతో రాజధానిగా అమరావతి ఉనికినే ప్రమాదంలోకి నెట్టివేసి, రెండున్నరేళ్లుగా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల శ్రద్ద చూపని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అకస్మాత్తుగా మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకొంటూ, ఇప్పుడు క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో అమరావతి కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయించడాన్ని ఆ ప్రాంత గ్రామస్తులు అనుమానంతో చూస్తున్నారు.

మొత్తం 29 గ్రామాలు ఉండగా, కేవలం 16 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటును నిర్విర్ధంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రకియలో భాగంగా గురువారం మొదటగా లింగాయపాలెం జరిగిన గ్రామసభను అక్కడి గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. మొత్తం 29 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గ్రామస్థుల డిమాండ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

తుళ్లూరు ఎంపిడి వో, పంచాయతీరాజ్ ఈవో ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానం చేశారు.  19 గ్రామాల అమరావతి కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించారు . ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్తామని  తుళ్లూరు ఎంపీడీవో శ్రీనివాసరావు ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని నిమిత్తము, 2014 వ సంవత్సరంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ’  చట్టం ప్రకారం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి  మండలాల్లోని 29 గ్రామాలలో ఉన్న వ్యవసాయ భూములను భూ సమీకరణ పథకం కింద తీసుకుని, చట్ట ప్రకారం బ్రహత్తర ప్రణాళిక తో అభివృద్ధి చేసి,   రైతులకు అభివృద్హి చేసి ఇవ్వవలసిన ప్లాట్లు
అభివృద్ధి చేయకుండా కొత్త స్థానిక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం సరి కాదని వారు తేల్చి చెప్పారు.

రాజధానిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి , ఇక్కడికి వలసలు పెరిగి, జనాభా పెరిగి ఆదాయ వనరులు పెరిగిన తరువాత మాత్రమే స్థానిక సంస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మునిసిపల్  కార్పొరేషన్ ఏర్పాటు కు ఉండవలసిన జనాభా నిష్పత్తి లేకుండా మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తగదని వారించారు.

 పంచాయతీలను మునిసిపల్ కార్పొరేషన్ గా తయారుచేసి, మునిసిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా,దాని స్వయం సమృద్ధి కోసం ఇప్పుడు సీ.ఆర్.డీ. ఏ.ద్వారా గ్రామాలలో అందుతున్న సేవలపై తమపై కొత్తగా వేయబోయే పన్నులు (అనగా నీటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను వంటి వి) గ్రామస్థులకు మోయలేని భారంగా తయారవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మునిసిపల్ కార్పొరేషన్ చట్ట ప్రకారం తమ  ప్లాట్ లపై విధించే ఖాళీ నివేశన స్థల పన్ను (0.05%,అనగా ఇప్పటి ప్రభుత్వ ధర ప్రకారం చదరపు గజానికి సంవత్సరానికి రూ.2.50 పై) చెల్లించాల్సి వస్తే ఇప్పటికే ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యక్రమాల వలన ఆర్ధికంగా నష్ట పోయిన రైతులు తమ భూములను పన్నులు చెల్లించడానికి అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ గ్రామాలలో నివసించే జనాభాలో 80 శాతం బడుగు బలహీన వర్గాల వారే. గతంలో కొంతమంది వ్యవసాయాధారిత పనులకు పోగా, మిగిలిన వారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ  పధకం ద్వారా ఉపాధి పొందేవారు. ఇప్పుడు వ్యవసాయ భూమి రాజధాని కోసం పోగా, రైతు కూలీలు, మిగిలిన వారు అందరూ పని లేక అలమటిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నే వారికి పెద్ద దిక్కుగా మారింది. 

ఈ గ్రామాలను కార్పొరేషన్ గా మార్చితే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందుబాటులో లేక భారత ప్రభుత్వం కల్పించిన  హక్కును కోల్పోయి దిక్కులేని వారిగా మిగిలిపోతామని పేర్కొన్నారు. 

29 గ్రామాల రాజధాని నగరం అమరావతిని  భారత ప్రభుత్వం వారు, స్మార్ట్ సిటీ గా గుర్తించి, అమరావతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమములు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం  చేస్తున్న విధముగా గ్రామాలను విడదీసి నట్లయితే అభివృద్ధి కార్యక్రమాలకు అనేక ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.

29 గ్రామాలతో కూడిన అమరావతి ని రాజధానిగా ప్రకటించి, ముందుకు వెళుతున్న దశలో వివిధ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం వలన(అనగా అమరావతి లో భాగంగా మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను తాడేపల్లి – మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ లో చేర్చడం) విభిన్న వర్గాల నుండి వచ్చే అభిప్రాయం, ఏకాభిప్రాయం అవ్వకపోతే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

ఇప్పటికే  అమరావతి గా ఉన్న గ్రామాలను విడదీసి వేర్వేరు స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం ప్రభుత్వ దురుద్దేశం,
కనుక దురుద్దేశపూర్వకంగా, బలవంతంగా, రైతులకు నష్టం కలిగించే విధంగా తీసుకునే ఈ చర్యలను తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.