ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్న రఘురామరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో‌ చెప్పాలని ఒకింత సవాల్ విసిరారు. 
 
అంతటితో ఆగని ఆయన.. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజధాని అమరావతి ఎజెండాతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో తన ఎన్నిక ద్వారా నిరూపిస్తానని చెప్పుకొచ్చారు.
 
ఏపీలో కొన్ని పత్రికలు, చానల్స్‌ను బ్యాన్ చేయటాన్ని ఈ సందర్భంగా రఘురామ తీవ్రంగా ఖండించారు. కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం పార్లమెంట్ నియోజకర్గం నుంచి రఘురామ పోటీచేసి గెలిచారు. అంతకు ముందు టిడిపి, బీజేపీలలో ఉన్నారు.
 
కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనీ కోరుతూ సిబిఐ ప్రత్యేక కోర్ట్ లో పిటీషన్ వేసినప్పటి నుండి తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించారు. ఏపీ సిఐడి ఆయనపై ఒక కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం, తనను చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపించడంతో తీవ్ర కలకలం రేగింది.