అభ్యర్థుల ఎన్నికల వ్యయం పెంపు

ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు పెట్టే ఖర్చుల పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధన ప్రకారం పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులు 2014 వరకూ 70 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చన్న నిబంధన ఉండేది. ఇకపై వీరు రూ.95 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు.
 
 రూ.54 లక్షలు ఖర్చు చేసే నిబంధన ఉన్న ప్రాంతాల్లో రూ.75 లక్షలను ఖర్చుచేసుకోవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.28 లక్షల ఖర్చు చేయాలన్న నిబంధన ఉన్నవారు తాజా నిబంధనల ప్రకారం రూ.40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. 
 
రూ.20 లక్షలు ఖర్చు చేయాలన్న నిబంధనతో ఇప్పుడు రూ.28 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఇకపై జరిగే ఎన్నికల్లో ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
 
మరోవంక, త్వరలో ఎన్నికల జరగనున్న ఐదు రాష్ట్రాల్లోని పరిస్థితిపై ఎన్నికల కమిషన్‌ గురువారం సమీక్ష జరిపింది. ఈ రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషన్‌, ఆరోగ్య రంగ నిపుణులతో పరిస్థితిని సమీక్షించింది. అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. 
 
ఈ సమావేశంలో రాజేష్‌ భూషన్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ బలరామ్‌ భార్గవ్‌ తదితరలు పాల్గొన్నారు. మరొక ప్రత్యేక సమావేశంలో ఈ ఐదు రాష్ట్రాల్లోని శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు కుమార్‌ భల్లాతో సమీక్షించింది. 
 
త్వరలోనే ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం రానున్న కొన్ని రోజుల్లోనే పోలింగ్‌ తేదీలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించనుందని అంచనా.