సంతానం స్థానంలో జంతువులు… పోప్ వ్యాఖ్యలపై దుమారం

సమాజంలో కొన్నిసార్లు సంతానం స్థానాన్ని పెంపుడు జంతువులు ఆక్రమిస్తున్నాయని అంటూ పోప్ ఫ్రాన్సిస్ చేసిన వాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. వాటికన్‌లో సాధారణ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నేటి యువత పిల్లల్ని కనకుండా పెంపుడు జంతువులకు ప్రాధాన్యం ఇస్తూ ఓ రకమైన స్వార్థాన్ని ప్రదర్శిస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

పోప్ ఫ్రాన్సిస్ 2014లో కూడా సంతానానికి బదులుగా జంతువులను పెంచుకోవడం సాంస్కృతిక పరమైన క్షీణత అని స్పష్టం చేశారు. తిరిగి తాజాగా,  నేడు మనం ఓ రకమైన స్వార్థాన్ని చూస్తున్నామని, కొందరు వ్యక్తులు పిల్లల్ని కనాలనుకోవడం లేదనే విషయాన్ని మనం గమనిస్తున్నామని పేర్కొన్నారు.

ఒక్కొక్కసారి ఒక బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారని, కానీ కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నారని, పిల్లల స్థానాన్ని పెంపుడు జంతువులు ఆక్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ మాటలు జనానికి నవ్వు తెప్పించవచ్చు కానీ ఇది వాస్తవమని అని స్పష్టం చేశారు. 

ఇలా చేయడం మాతృత్వాన్ని, పితృత్వాన్ని నిరాకరించడమేనని స్పష్టం చేశారు. ఇది మనల్ని క్షీణింపజేస్తుందని, మనలోని మానవత్వాన్ని పోగొడుతుందని తెలిపారు. కాగా, జీవ సంబంధమైన కారణాల వల్ల పిల్లలు కలగనివారు దత్తత తీసుకోవడం గురించి పరిశీలించాలని ఆయన సూచించారు.

తల్లిదండ్రులు కావడానికి వెనుకాడకూడదని హితవు చెప్పారు. బిడ్డను కనడం రిస్క్‌తో కూడుకున్నదేనని, అయితే పిల్లలు లేకపోవడం మరింత రిస్క్ అని వివరించారు.

అయితే ఆయన వాఖ్యలపై భిన్నమైన స్పందన సోషల్ మీడియాలో వెలువడుతుంది. పెంపుడు జంతువులుగలవారు స్వార్థపరులని వ్యాఖ్యానించడాన్ని చాలా మంది నెటిజన్లు తప్పుబట్టారు. తమ ‘‘నాలుగు కాళ్ళ పిల్లల’’ ఫొటోలను పోస్ట్ చేశారు. తమకు ఎంపిక చేసుకునే హక్కు ఉందని మరి కొందరు వాదించారు.

ఓ కర్తవ్యంగా పిల్లల్ని కనకూడదని, దానివల్ల అలాంటి పిల్లల బాల్యం విచారకరంగా గడిచే అవకాశం ఉంటుందని వాదించారు. పిల్లల్ని కనడం ఓ ఛాయిస్ అని, అదొక బాధ్యత కాదని పేర్కొన్నారు. జననాల నియంత్రణ, గర్భస్రావ హక్కులను కేథలిక్‌లు వ్యతిరేకించడం వల్ల ఆత్మీయ కుటుంబాలు ఏర్పడబోవని పేర్కొన్నారు. జీసస్ ఎన్నడూ చెప్పని అంశాల్లో ఇదొకటని వాదించారు.

పోప్ ఆసక్తికరంగా మాట్లాడుతున్నారని, తాను పిల్లల్ని కనకూడదని ఆయన ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకున్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లుందని లియో మాంటేగ్ అనే ట్విటరాటీ గుర్తు చేశారు. థీ స్టీఫెయిన్ ఇచ్చిన ట్వీట్‌లో, మహిళల గర్భాశయం పట్ల అలాంటి కాముకత పోప్‌తోపాటు చాలా మందికి ఉందని పేర్కొన్నారు.

ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని హితవు చెప్పారు. అందరూ పిల్లలను కోరుకోరని ఆమె చెప్పారు. ఇప్పటికే పుట్టిన, ప్రేమ, ఆశ్రయం, సంతోషకరమైన నివాస స్థానాలు అవసరమైన పిల్లలను సమాజం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

ఎమ్మా క్రొకెర్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘పోప్ ఫ్రాన్సిస్ గారూ, చూడండి. నా కుటుంబం ఫొటోను చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మన సమాజానికి, పెంపుడు జంతువులకు సేవ చేయడానికి మా జీవితాలను అంకితం చేస్తున్న స్వార్థపూరిత నర్సులం మేం. నిజాయితీగా చెప్తున్నాను’’ అని తెలిపారు.