సంజయ్ అరెస్ట్ పై మండిపడ్డ నడ్డా

సంజయ్ అరెస్ట్ పై మండిపడ్డ నడ్డా
ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నడ్డా బండి సంజయ్ అరెస్ట్‌పై మాట్లాడుతూ  బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ధ్వజమెత్తారు. 
 
బీజేపీ సాధిస్తున్న ప్రజా విజయాలను, బీజేపీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ సర్కారుకు పిచ్చెక్కిందని ఎద్దేవా చేశారు. పోలీసుల చర్యను నడ్డా తప్పుబట్టారు. అక్రమ కేసులకు భయపడబోమని, న్యాయపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. 

పోలీసులు దురుసుగా ప్రవర్తించి అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది సేపటి క్రితం బండి సంజయ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్నారని నడ్డాకు  సంజయ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

దీంతో వెంటనే స్పందించిన జేపీ నడ్డా ‘‘సంజయ్ జీకి నా మాటగా చెప్పండి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ జీ చేస్తున్న పోరాటం భేష్.. కేసుల విషయంలో ఏం వర్రీ కావొద్దు.. మేం చూసుకుంటాం.. న్యాయ స్థానంలో మేం పోరాడతాం.. జాతీయ నాయకత్వం యావత్తు  సంజయ్ జీ వెంట ఉంది.  గో…హెడ్’’ అని భరోసా ఇచ్చారు.

సంజయ్ కు బెయిల్ నిరాకరణ 

మరోవైపు నిన్న అరెస్ట్ చేసిన బండి సంజయ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోవిడ్ ఉల్లంఘన, పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఇప్పటికే బండి సంజయ్‌పై కేసులు పెట్టారు.
 
కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్ సంజయ్ కు బెయిల్ నిరాకరిస్తూ  14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బండి సంజయ్ సహా మరో ఐదుగిరికి రిమాండ్ విధించింది కోర్టు. 
 
కరీంనగర్ లో జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ తో సహా 16 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని మాత్రమే కోర్టులో  హాజరుపరిచారు. మిగతా వారు  పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
 
ఇలా ఉండగా, ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని  బీజేపీ ఎమ్మెల్యే ఎన్  రఘనందనరావు తెలిపారు. సోమవారం కరీంనగర్‌లో రఘనందనరావు పర్యటిస్తూ  . ఉద్యోగాల సంఘాల నేతలు పదవుల కోసం పెదవులు మూయోద్దని వ్యాఖ్యానించారు. కూకట్‌పల్లి కమిషనర్‌గా పనిచేసేందుకో… భర్తలకు ఉద్యోగ పొడిగింపు  కోసమో… ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
 
కరీంనగర్ సీపీ‌కి‌ వివాదాస్పదుడిగా  పేరుందని పేర్కొంటూ  కరీంనగర్ సీపీ ఆధ్వర్యంలో లా అండ్ పరిరక్షించబడదని స్పష్టం చేశారు. కేసీఆర్ నల్గొండ పర్యటనలో మాస్క్ లేకుండా వేల మందిలో తిరిగితే చర్యలెందుకు తీసుకోరు? అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ మాస్క్ లేకుండా  ప్రెస్ మీట్ నిర్వహించారని తెలిపారు. 
 
ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ఎంపీ వేల మందితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.  డీజీపీకి సోకు ఉంటే రాజకీయాల్లోకి రావొచ్చని  రఘనందనరావు ఎద్దేవా చేశారు.