యుపిలో తిరిగి బీజేపీదే అధికారం!

త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని వీటో సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం 403 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 230-249 సీట్లు వచ్చే అవకాశం ఉందని వీటో పేర్కొంది. గతంలో పలు సర్వేలు సహితం ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. 
 
‘టైమ్స్‌ నౌ నవ్‌భారత్‌’ కోసం వీటో గత నెల 16 నుంచి 30 వరకు ఈ సర్వే చేసింది. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి 137 నుంచి 152 సీట్లు, బీఎస్పీ 9 నుంచి 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఈసారి కూడా నాలుగు నుంచి ఏడు స్థానాలకే  పరిమితం అవుతుందని పేర్కొంది.
 
‘‘బీజేపీ నేతృత్వంలోకి కూటమికి ఈసారి 38.6 శాతం ఓట్లు రావొచ్చు. 2017 కన్నా ఇది మూడు శాతం తక్కువ. ఎస్పీకి 34.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక 2017లో 22.2 శాతం ఓట్లు పొందిన బీఎస్పీ ఈసారి 14.1 శాతం వద్దే పరిమితం అవుతుంది. బీఎస్పీ ఓట్లన్నీ ఎస్పీ లేదా బీజేపీకి మళ్లే అవకాశం ఉంది’’ అని సర్వే వివరించింది. 
 
ఇప్పటికే రామ మందిర నిర్మాణం ప్రారంభమవడం, కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ కూడా అందుబాటులోకి రావడం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అనుకూలంగా మారుతుందని సర్వే పేర్కొంది. కాగా బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తర ప్రదేశ్ లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన నేతగా రికార్డు సృష్టిస్తారు. 1985 నుంచి ఇప్పటిదాకా ఎవరూ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి కాలేదు.
ఆదిత్యనాథ్ మధుర నుండి పోటీ చేయాలి 
 
ఇలా ఉండగా, 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు మథుర నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించారు.

ప్రస్తుత ముఖ్యమంత్రిని శ్రీ కృష్ణ జన్మభూమి నుండి పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలనే తన డిమాండ్‌కు శ్రీకృష్ణుడు తనను ప్రేరేపించాడని నడ్డాకు రాసిన లేఖలో యాదవ్ పేర్కొన్నారు.

2022లో జరగనున్న యూపీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంపై నిర్ణయాన్ని పార్టీ నాయకత్వానికే వదిలేశారు. 2022 యూపీ ఎన్నికల్లో అయోధ్య, మధుర లేదా తన కంచుకోట అయిన గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, “పార్టీ ఎక్కడ చెప్పినా నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను” అని ఆదిత్యనాథ్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పదవీకాలంపై వ్యాఖ్యానించవలసిందిగా మీడియా ప్రతినిధులను అడిగినప్పుడు, “ఏది చెప్పినా జరిగింది. పశ్చాత్తాపపడవలసిన పని లేదు” అని స్పష్టం చేసారు. ఇటీవల ఫరూఖాబాద్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మథురలో శ్రీకృష్ణుడి గొప్ప ఆలయం నిర్మాణం గురించి ప్రస్తావించారు.

“జబ్ అయోధ్య హో సకా, తో మథుర-బృందావన్ కైసే చోడ్ దేంగే (అయోధ్య జరిగితే, మనం మధుర-బృందావనం ఎలా సాకారం చేయలేము'” అని ర్యాలీలో చెప్పారు. డిసెంబరు 2021లో, అఖిల భారత హిందూ మహాసభ షాహీ ఈద్గా మసీదు లోపల ఉన్న దేవత  “అసలు జన్మస్థలం” వద్ద శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అనుమతి కోరిన తర్వాత మధుర వార్తల్లో నిలిచింది.

హిందూ మహాసభ డిమాండ్‌తో యూపీ ప్రభుత్వం కత్రా కేశవ్ దేవ్ ఆలయం, షాహీ ఈద్గా దగ్గర భద్రతను పెంచింది. కాగా, మధురకు చెందిన బీజేపీ ఎంపీ హేమ మాలిని కూడా అయోధ్య, కాశీ విశ్వనాథ్ తరహాలో పవిత్ర నగరంలో శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.