విశాఖ, హైదరాబాద్ లలో అల్లూరి మ్యూజియంలు 

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మ్యూజియంలను విశాఖపట్నం, హైదరాబాద్ లలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. 
 
విశాఖలోని లంబసింగిలో అల్లూరి సీతారామారాజు మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం రూ.38 కోట్లు కేటాయిందని, ఇందులో ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వానికి 6.93 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 2024 వరకు పనులు పూర్తవుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో అల్లూరి మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం రూ.18 కోట్లు కేటాయించిందని, ఇప్పటికే రూ.కోటి విడుదల చేసిందని తెలిపారు.
బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు ప్రజల హృదయాల్లో చిరకాలం గుర్తుంటారని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూలై 4న ఢిల్లీలో నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా  గుర్తింపు పొందని స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించి, వారి గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని ఆయన పేర్కొన్నారు.
తెలుగువారికి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు దక్కేలా చేసేందుకు, అల్లూరి గురించి నేషనల్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ కమిటీ అధ్యక్షుడికి వివరించానని కిషన్ రెడ్డి చెప్పారు. ఏపీలోని మొగల్లులో అల్లూరి సీతారామరాజు ఇంటిని చూసేందుకు తాను ఈ నెల 13న అక్కడికి వెళ్తున్నట్లు తెలిపారు.
అల్లూరి చరిత్రను ఇతర రాష్ట్రాల నేతలు, ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర తరపున ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా సినిమాలో నటించిన సూపర్‌స్టార్‌ కృష్ణను క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో సత్కరించారు.
అల్లూరి సీతారామరాజు చిత్ర విశేషాలను హీరో కృష్ణ నెమరువేసుకొంటూ తాను  నటించిన అన్ని చిత్రాలలోకెల్లా తనకు అత్యంత తృప్తి ఇచ్చిన చిత్రమని చెప్పారు. ఆ రోజులలో సంవత్సరంపాటు ప్రదర్శించడం ద్వారా తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని ఆదరించారని గుర్తు చేసుకున్నారు.
అల్లూరి సీతారామరాజు తెలంగాణలో పుట్టి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24 ఎకరాల్లో ఆయన స్మృతివనాన్ని ఏర్పాటు చేసేవాళ్లమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు. దక్షిణాది ప్రాంతానికి చెందిన తెలుగు వాడైనందుకే సీతారామరాజుపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. 
 
పార్లమెంటులో అల్లూరి విగ్రహం లేకపోవడం బాధాకరమని, విగ్రహ ఏర్పాటుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషి చేయాలని ఆయన కోరారు. త్వరలో మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి నగర శివారులోని కొంపల్లిలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేయించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. 
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, నటుడు మోహన్‌బాబు, కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.