రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు

కేంద్ర ప్రభుత్వం నూతన సంత్సరం కానుకగా శనివారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద విడుదల చేసింది. వ్యవసాయ రంగంలో ప్రతిఏటా పెట్టుబడి సాయంగా ఈ పథకం ద్వారా అందజేసే నిధుల్లో భాగంగా రూ.20,900కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు కేంద్రం జమ చేసింది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ 10వ విడత కింద వర్చువల్ విధానం ద్వారా ఈ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 10.09 కోట్ల మంది రైతులకు ఈ నిధుల ద్వారా లబ్ది చేకూరనుంది. 
 
ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ  పలువురు రైతులతో మాట్లాడుతూ  ఎగుమతుల్లో ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. అందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 8 శాతానికి పైగా ఉందని పేర్కొన్నారు.

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతియేటా పెట్టుబడి సాయంగా కేంద్రం రూ.6వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో 2వేల చొప్పున విడుదల చేస్తూవస్తోంది. ప్రస్తుతం 10వ విడుతగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
 
అలాగే దేశంలోని 351 ప్రార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఒ)లకు ప్రధాని మోడి రూ.14కోట్లు ఈక్కిటి గ్రాంట్స్ విడుదల చేశారు. దీని ద్వారా 1.24లక్షల మంది రైతులు లబ్ది పోందనున్నారని వివరించారు.
 
ఇలా ఉండగా, నూతన సంవత్సరంలో భారత్ తన అభివృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, కరోనా  మహమ్మారితో ఎదురయిన సవాళ్లు వృద్ధి ప్రక్రియకు అడ్డంకి కాకూడదని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. దేశం కరోనా  మహమ్మారిని పూర్తి జాగ్రత్తలతో, నిఘాతో ఎదుర్కొంటుందని, అదే సమయాంలో దేశ ప్రయోజనాలను కూడా కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.

కరోనా  మహమ్మారి ఓ వైపు కొనసాగుతున్నప్పటికీ 2021 సంవత్సరంలో దేశం ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం, స్టార్టప్, పర్యావరణం, మౌలిక సదుపాయాలు లాంటి రంగాల్లో సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశం సాగించిన బలమైన పోరాటానికి, అలాగే ఈ సంవత్సర కాలంలో చేపట్టిన సంస్కరణలకు గాను 2021 సంవత్సరం గుర్తిండిపోతుందని ప్రధాని చెప్పారు. 

అంతేకాకుండా 145 కోట్లకు పైగా కరోనా టీకాల  డోసుల రికార్డును సాధించడాన్ని ఆయన ప్రశంసించారు. గడచిన ఏడాది భారత్ వివిధ రంగాల్లో సంస్కరణలను వేగవంతం చేసిందని, ఆధునిక మౌలిక సదుపాయాలను సృష్టించిందని ప్రధాని తెలిపారు. ‘ అభివృద్ధి వేగాన్ని మరింతగా పెంచాలని చెబుతూ   మహమ్మారి సవాళ్లను విసురుతోందని, కానీ అభివృద్ధి ప్రక్రియను అడ్డుకోలేదని ప్రధాని స్పష్టం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతానికి కన్నా ఎక్కువగా వృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, విదేశీ ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, జిఎస్‌టి వసూళ్లు సైతం పెరుగుతున్నాయని కొత్త ఏడాదిలో చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయని, ఎగుమతుల విషయంలో ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయ రంగంలో దేశం సరికొత్త నమూనాలను నెలకొల్పిందని కూడా ఆయన చెప్పారు. మహిళల వివాహ వయసును మగవారితో సమానంగా 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు పెంచే ప్రక్రియను చేపట్టినట్లు కూడా ప్రధాని చెప్పారు.