రక్షణ, క్రీడా రంగాల్లో దేశ భక్తి జ్వాలను రగిలిస్తున్న మీరట్

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్, దాని పరిసర ప్రాంతాలు స్వతంత్ర భారత దేశానికి నూతన దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొంటూ దేశ రక్షణ, క్రీడా రంగాల్లో దేశ భక్తి జ్వాలను రగిలిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ భరత మాత ముద్దు బిడ్డ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన గడ్డ మీరట్ అని పేర్కొన్నారు.
కొద్ది నెలల క్రితం క్రీడా రంగంలో దేశంలో అత్యున్నత స్థాయి పురస్కారానికి ఆయన పేరు పెట్టామని ఆయన గుర్తు చేశారు. నేడు క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఆయనకు అంకితం చేస్తున్నామని తెలిపారు. 700 కోట్లతో  నిర్మించే ధ్యాన్ చంద్  యూనివర్సిటీలో  అంతర్జాతీయ  స్థాయి వసతులు కల్పిస్తామని, ప్రతి సంవత్సరం ఈ విశ్వవిద్యాలయం నుంచి 1,000 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లు అవుతారని చెప్పారు.
క్రీడా రంగంలో స్థానిక ప్రతిభావంతులను ప్రపంచ స్థాయికి ఎదిగే విధంగా ఈ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకు క్రీడాకారుల పట్ల ఆసక్తి ఉండేది కాదని,  క్రీడాకారులను గౌరవించేవారు కాదని విమర్శించారు. గతంలో కేవలం సంపన్నులు మాత్రమే క్రీడల్లో శిక్షణ పొందగలిగేవారని, అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్శిటీ దేశంలోని కొంతమంది ప్రతిభావంతులైన యువకులను బయటకు తీసుకువస్తుందని, ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఉంటుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. “స్పోర్ట్స్ యూనివర్సిటీకి ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. అతని పేరులోనే సందేశం కూడా ఉంది. ‘ధ్యాన్’ అంటే దృష్టి. ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ‘ధ్యాన్’,  దృష్టిని కలిగి ఉంటారు, ఇది మనకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. వారిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఇదొకటి అవుతుంది’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ, ఉత్తర ప్రదేశ్‌లో గతంలో మాఫియా, క్రిమినల్స్ ఆడుకునేవారని, చట్టవిరుద్ధ ఆక్రమణల టోర్నమెంట్లు జరిగేవని ఎద్దేవా చేశారు. బాలికలపైనా, మహిళలపైనా వ్యాఖ్యలు చేసేవారు స్వేచ్ఛగా తిరగగలిగేవారని చెప్పారు.
 
ఇంతకుముందు నేరస్తులు, మాఫియా వారి ఆటలు ఆడేవారు, కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వారితో “జైలు-జైలు” ఆడుతోందని పేర్కొన్నారు. ”గత ప్రభుత్వ హయాంలో నేరస్తులు తమ ఆటలు ఆడేవారు, మాఫియా వారి ఆటలు ఆడేవారు. ఇంతకుముందు, అక్రమంగా లాక్కోవడం (భూమి) టోర్నమెంట్లు ఉన్నాయి. కూతుళ్లపై చెడు వ్యాఖ్యలు (‘ఫాబ్తియాన్’) చేసే వ్యక్తులు బహిరంగంగా తిరిగేవారు, ” అని ప్రధాని ధ్వజమెత్తారు. 
నవ భారతానికి యువత చాలా ముఖ్యమని చెబుతూ, నవ భారతానికి పరిపాలకులు యువతేనని తెలిపారు. వారే నాయకులని స్పష్టం చేశారు. భారత దేశ యువతకు ప్రాచీన వారసత్వం ఉందని, అంతేకాకుండా ఆధునిక భావాలు కూడా వారికి ఉన్నాయని తెలిపారు. యువత ఎక్కడికి తీసుకెళ్తే, దేశం అక్కడికి వెళ్తుందని పేర్కొంటూ  భారత దేశం ఎంత వరకు వెళ్తే, ప్రపంచం అంత వరకు వెళ్తుందని తెలిపారు.