శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా

త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయితే తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. 
 
2017లో పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టవలసి రావడంతో ఆ తర్వాత శాసన మండలికి ఎన్నికయ్యారు. ఆయన ముందున్న ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్ లు సహితం ఎమ్మెల్సీలుగానే ఉన్నారు. అసెంబ్లీకి పొటీ  చేయలేదు. అయితే ఈ పర్యాయం బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదిత్యనాథ్ భావిస్తున్నారు. 
రానున్న శాసన సభ ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అయోధ్య, మధుర, లేదా, మీ సొంత జిల్లా గోరఖ్‌పూర్ నుంచా? అని మీడియా అడిగినపుడు యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. 

ఈ ఐదేళ్ళ పదవీ కాలంలో చేయలేకపోయిన పని ఏదైనా ఉందా? అని అడిగినపుడు యోగి స్పందిస్తూ, చెప్పిన వాటినన్నిటిని చేశామని పేర్కొన్నారు. ఫలానా పని చేయలేకపోయాననే విచారం లేదని స్పష్టం చేశారు.  కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ పోటీ చేసే అవకాశం రాదనే ఆందోళనను తొలగించడానికి ఆయన ప్రయత్నించారు. 

బీజేపీ చాలా పెద్ద కుటుంబమని తెలిపారు. సమయాన్నిబట్టి ఈ కుటుంబ సభ్యుల పాత్ర మారవచ్చునని అంటూ కొందరు ప్రస్తుత ఎమ్యెల్యేలకు తిరిగి పోటీచేసే అవకాశం రాకపోవచ్చని సంకేతం ఇచ్చారు. ప్రతి వ్యక్తి పాత్ర వేర్వేరు కాలాల్లో వేర్వేరు విధంగా ఉంటుందని చెబుతూ ఓ వ్యక్తి ఎల్లప్పుడూ ప్రభుత్వంలోనే ఉండాలనేమీ  లేదని, పార్టీ కోసం పని చేయవచ్చునని తెలిపారు. 

ఎన్నికల ప్రచారంలో కరోనా మహమ్మారి నిరోధక మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడామని, ప్రస్తుతం తమ ప్రభుత్వ విజయాల ప్రాతిపదికపై పోటీ చేస్తున్నామని తెలిపారు.