దక్షిణాఫ్రికాలో రాత్రి కర్ఫూ ఎత్తివేత

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మొదటిసారిగా బయటపడిన దక్షిణాఫ్రికాలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను తొలగించింది. దాదాపు రెండేళ్లుగా రాత్రి వేళ అమలవుతున్న కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
 
అదేవిధంగా, సభలు, సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితిని పెంచింది. కరోనా నాలుగో వేవ్‌ తీవ్రత నుంచి దేశం బయటపడినట్లేనని పేర్కొంది. అయితే, ఒమిక్రాన్‌ కారణంగా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.  ఆఫ్రికా ఖండంలోనే అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 35 లక్షల మంది కరోనా బారిన పడగా 90వేల మంది చనిపోయారు.
 
నాలుగో ఉధృతి శిఖరస్థాయిని తాకి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షభవనం ఓ ప్రకటనలో తెలిపింది. కటనకు ముందు అధ్యక్షభవన అధికారులు నేషనల్ కరోనావైరస్ కమాండ్ కౌన్సిల్(ఎన్‌సిసిసి), ప్రెసిడెంట్స్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్(పిసిసి)తో సమావేశం నిర్వహించారు.
ఇక నుంచి రాత్రివేళ ప్రజల కదలికలపై ఆంక్షలు ఉండవని తెలిపింది. అయితే, కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది. నూతన సంవత్సరం సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో 2000 మందికి, ఇండోర్‌లో 1000 మందికి మాత్రమే పరిమితమై వేడుకలు నిర్వహించుకోవాలని తెలిపింది. వేదిక సామర్థంలో 50 శాతానికే పరిమితి విధించింది.
భౌతిక దూరం, మాస్క్ నిబంధనలు అమలు చేయాలని తెలిపింది. ఒమిక్రాన్‌ను మొదట దక్షిణాఫ్రికాలోనే నవంబర్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఆ దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లోని రెండు రాష్ట్రాలుమినహా అంతటా కేసులు తగ్గుముఖం పట్టాయని అధ్యక్ష భవనం తన ప్రకటనలో పేర్కొన్నది.