ఎనిమిదో సారి ఆసియా క‌ప్ విజేత‌గా యువ భార‌త్

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ 19 ఆసియాక‌ప్‌ను భారత్  సొంతం చేసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్‌లో గెల‌వ‌డం ద్వారా తుదిపోరులో ఓడిపోని జ‌ట్టుగా త‌న ట్రాక్ రికార్డును యువ భార‌త్ కొన‌సాగించింది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ట్రోఫిని గెలుచుకోని ఔరా అనిపించింది. 
 
అయితే 2012లో మాత్రం మ‌రో టీంతో క‌లిసి క‌ప్‌ ను పంచుకుంది. ఇప్ప‌టివ‌రకు జరిగిన 9 ఆసియాక‌ప్ ఎడిష‌న్ల‌లో ఎనిమిదింటిని భారత్ గెలుచుకోవ‌డం విశేషం. మొద‌ట శ్రీ‌లంక బ్యాటింగ్ చేయగా భారత యువ బౌల‌ర్ల ధాటికి ఆ జ‌ట్టు ఏ ద‌శ‌లోనూ భారీ స్కోర్ సాధించేలా క‌నిపించ‌లేదు.
శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.  శ్రీలంక టీమ్ 38 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 21.3 ఓవర్లలో 104/1 స్కోరు చేయగా.. వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విక్టరీ సాధించింది.
శ్రీలంక జ‌ట్టు స్కోర్ 3 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా భార‌త బౌల‌ర్ ర‌వికుమార్ తొలి వికెట్‌ను తీశాడు. చమిందు విక్రమసింఘే 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. అనంత‌రం 15 ప‌రుగుల వ‌ద్ద 6 ప‌రుగులు చేసిన షెవాన్ డేనియల్‌ను రాజ్ బావ ఔట్ చేశాడు.  31 ప‌రుగుల వ‌ద్ద 9 ప‌రుగులు చేసిన అంజల బండారను కౌశ‌ల్ థాంబే ఔట్ చేశాడు. 37 ప‌రుగుల వ‌ద్ద మ‌రోసారి చెల‌రేగిన కౌశ‌ల్ థాంబే 4 ప‌రుగులు చేసిన పవన్ పతిరాజాను ఔట్ చేశాడు. అనంత‌రం 14 ప‌రుగులు చేసిన సదీషా రాజపక్సను విక్కీ ఓస్ట్వాల్ ఔట్ చేశాడు.
దీంతో శ్రీ‌లంక జ‌ట్టు 47 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. శ్రీ‌లంక స్కోర్‌ 57 పరుగుల‌కు చేరుకోగానే మ‌రో సారి చెల‌రేగిన విక్కీ ఓస్ట్వాల్ ఓకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసి శ్రీ‌లంకను దెబ్బ‌కొట్టాడు. 9 ప‌రుగులు చేసిన కెప్టెన్ డి వెల్లలాగేను, 7 ప‌రుగులు చేసిన రానుడా సోమరత్నేను ఔట్ చేశాడు. దీంతో లంక 57 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయింది.
 
లంక స్కోర్ 32.5 ఓవ‌ర్ల‌లో 74-7గా ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా వ‌రుణుడు అడ్డుప‌డ్డాడు. రెండు గంట‌లపాటు ఆటంకం క‌ల్గించాడు. వ‌ర్షం అనంత‌రం ప్రారంభ‌మైన మ్యాచ్‌ను అంపైర్లు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్దతిలో 38 ఓవ‌ర్ల‌కు కుదించారు. 
 
వ‌ర్షం త‌ర్వాత మ్యాచ్ ప్రారంభ‌మ‌య్యాక శ్రీ‌లంక స్కోర్ 82కు చేరుకోగానే 15 ప‌రుగులు చేసిన రవీన్ డి సిల్వాను తెలుగు కుర్రాడు షేక్ ర‌షీద్ ర‌నౌట్ చేశాడు. ఆ త‌ర్వాత 106 ప‌రుగుల వ‌ద్ద 9వ వికెట్ రూపంలో 14 ప‌రుగులు చేసిన మతీష పతిరనను రాజవర్ధన్ హంగర్గేకర్ ఔట్ చేశాడు. 
 
దీంతో శ్రీ‌లంక జ‌ట్టు 38 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో విక్కీ ఓస్ట్వాల్ 3, కౌశ‌ల్ థాంబే 2, రాజ్ బావ‌, ర‌వి కుమార్, రాజవర్ధన్ హంగర్గేకర్ త‌లో వికెట్ తీశారు. దీంతో భార‌త్ ల‌క్ష్యాన్ని అంపైర్లు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 38 ఓవ‌ర్ల‌లో 102 ప‌రుగులుగా నిర్ణ‌యించారు.
 
103 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా ఆట‌గాళ్లు ఆడుతూ, పాడుతూ చేధించారు. 21.3 ఓవ‌ర్ల‌లో ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. దీంతో ఫైన‌ల్లో 9 వికెట్ల తేడాతో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. 
 ఓపెన‌ర్ అంగ్క్రిష్ రఘువంశీ 56 ప‌రుగుల‌తో, తెలుగు కుర్రాడు షేక్ ర‌షీద్ 31 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. మ‌రో ఓపెన‌ర్ హ‌ర్నూర్ సింగ్ 5 ప‌రుగులు చేశాడు.