అరుణాచల్ లో 15 ప్రదేశాలకు పేర్లు పెట్టిన చైనా 

దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో 15 ప్రదేశాలకు చైనా అక్షరాలు, టిబెటన్, రోమన్ వర్ణమాల పేర్లను చైనా ప్రకటించింది.

అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్ పేరు అయిన జాంగ్నాన్‌లోని 15 ప్రదేశాల పేర్లను చైనీస్ అక్షరాలు, టిబెటన్, రోమన్ వర్ణమాలలో ప్రామాణికం చేసినట్లు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ప్రకటించిన్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ గురువారం ప్రచురించింది.

ఇది స్టేట్ కౌన్సిల్, చైనా క్యాబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా ఉందని నివేదిక పేర్కొన్నది. ఖచ్చితమైన రేఖాంశం, అక్షాంశం ఇవ్వబడిన 15 ప్రదేశాల అధికారిక పేర్లలో, ఎనిమిది నివాస స్థలాలు, నాలుగు పర్వతాలు, రెండు నదులు, ఒకటి పర్వత మార్గం అని నివేదిక పేర్కొంది.

భారత్-చైనా సరిహద్దు వివాదం 3,488 కి.మీ పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)ని కవర్ చేస్తుంది. రెండవ బ్యాచ్‌లోని ఎనిమిది నివాస స్థలాలు షానన్ ప్రిఫెక్చర్‌లోని కోనా కౌంటీలోని సెంగ్‌కెజోంగ్, డాగ్‌లుంగ్‌జాంగ్, నైంగ్చిలోని మెడోగ్ కౌంటీలోని మణిగ్యాంగ్, డ్యూడింగ్ మరియు మిగ్‌పైన్, గోలింగ్, న్యింగ్‌చీలోని జాయు కౌంటీలోని డంబా, షానన్ ప్రిఫెక్చర్‌లోని లుంజే కౌంటీలోని మేజాగ్ పేర్లను గ్లోబల్ టైమ్స్ కధనం  పేర్కొంది.

నాలుగు పర్వతాలను వామో రి, డ్యూ రి, లున్‌జుబ్ రి, కున్‌మింగ్‌సింగ్‌జె ఫెంగ్ అని పేర్కొంది. రెండు నదులు గ్జిన్యోగమో హి,  దులైన హి, పర్వత మార్గానికి కోనా కౌంటీలో సె లా అని పేరు పెట్టారు.

బీజింగ్‌లోని చైనా టిబెటాలజీ రీసెర్చ్ సెంటర్‌లో నిపుణుడిగా పేర్కొన్న లియన్ జియాంగ్‌మిన్‌ను ఉటంకిస్తూ, వందల ఏళ్లుగా ఉన్న స్థల పేర్లపై జాతీయ సర్వేలో ఈ ప్రకటన భాగమని నివేదిక పేర్కొంది. వాటికి ప్రామాణికమైన పేర్లను ఇవ్వడం చట్టబద్ధమైన చర్య, చైనా సార్వభౌమాధికారం. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రామాణిక స్థల పేర్లను భవిష్యత్తులో ప్రకటిస్తామని లియాన్ చెప్పారు.

బీజింగ్ వాస్తవాధీన రేఖ ప్రస్తుత స్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వస్తున్నది.  తూర్పు లడఖ్‌కు సరిహద్దుగా ఉన్న భారతదేశంకు చెందిన  అక్సాయ్ చిన్ భూభాగంలో 38,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా ఇప్పటికే అక్రమంగా ఆక్రమించుకున్నది.

1963లో, పాకిస్తాన్ అక్రమంగా స్వాధీనం చేసుకున్న సుమారు 5,180 కి.మీ భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చింది. మరోవంక, భారత్, చైనాల మధ్య 20 నెలలుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. సమస్యల పరిష్కారానికి దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నా ఫలితం ఉండడం లేదు.