భారత దేశంలో తొలి ఒమైక్రాన్ మరణం?

దేశంలో తొలి ఒమైక్రాన్ మరణం సంభవించింది. కొత్త వేరియంట్ బారిన పడినవారి సంఖ్య 12 వందలు దాటింది. మహారాష్ట్రలోని పింపిరీకి చెందిన 52 ఏళ్ల వ్యక్తి మరణానికి ఒమైక్రాన్ కారణం కావచ్చునని అధికారులు భావిస్తున్నారు. గుండె పోటుతో చనిపోయిన ఆ వ్యక్తి శరీరంలో ఒమైక్రాన్ వైరస్‌ను గుర్తించారు. 
 
అయితే ఒమైక్రాన్ మరణంపై  మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. మరణించిన వ్యక్తికి ట్రావెల్‌ హిస్టరీ ఉందని, నైజీరియా నుంచి వచ్చినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అతడు గత 13 ఏళ్ల నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని పేర్కొంది.
 ‘బాధితుడు మరణానికి కోవిడ్ కారణం కాదు.. కానీ, యాదృచ్ఛికంగా పుణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబొరేటరీ నివేదిక అతడికి ఒమిక్రాన్ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారించింది’ అని మహా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను కొనసాగిస్తోంది. ఒకేచోట 50 మంది, అంతకంటే ఎక్కువమంది గుమికూడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

 ఇంతకుముందు పెళ్లిళ్లు, వేడుకలను 250 మంది హాజరు కావచ్చునని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా ఆ ఆంక్షలను సవరించింది. 50 మంది కంటే ఎక్కువమంది హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందిని మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి చేరింది. ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్ 97, రాజస్థాన్ 69, తెలంగాణ 62, తమిళనాడులో 46, కర్ణాటక 34 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌లో ఒమిక్రాన్ నుంచి 374 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో 16,764 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 7585 మంది పూర్తిగా కోలుకోగా, 220 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,361 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

వారపు కేసులు, పాజిటివ్‌ రేటు ప్రకారం మహారాష్ట్ర, బెంగాల్‌, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌లో పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో వైరస్‌ వ్యాప్తిని సూచించే.. ఆర్‌ విలువ 1.22గా ఉన్నదని, కేసుల పెరుగుదలకు ఇది హెచ్చరిక అని వివరించింది.
 
పరీక్షలు పెంచాలని, ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని, టీకా పంపిణీ వేగిరం చేయాలని, ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, హరియాణ, జార్ఖండ్‌,  గుజరాత్‌కు లేఖ రాసింది. 
 
ఈ రాష్ట్రాల్లోని  చెన్నై, ముంబై, బెంగళూరు, రాంచీ, కోల్‌కతా, బెంగళూరు, గుర్గావ్‌, పుణె, థానె, నాగపూర్‌ తదితర 14 నగరాల్లో పెద్దఎత్తున కేసులకు ఒమైక్రాన్‌ వ్యాప్తి ప్రధాన కారణమని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీ తరహాలో దేశమంతటా ఎల్లో అలర్ట్‌ను ప్రకటించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టులు పెంచాలని 19 రాష్ట్రాలను కోరింది.