ఒమిక్రాన్ యాంటీబాడీలతో డెల్టాను ఎదుర్కొనే సామర్థ్యం

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై పోరాటంలో శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారు. ఈ వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌తోపాటు, ఇతర రూపాంతరాలను సైతం తుదముట్టించగలిగే నాలుగు రకాల యాంటీబాడీస్‌ని సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. తాము చేసిన ఈ పరిశోధన కేవలం ఒమిక్రాన్‌కు మాత్రమే కాదు.. భవిష్యత్తులో వచ్చే రూపాంతరాలను సైతం ఎదుర్కోవడానికి, దానికితగ్గట్టుగా వ్యాక్సిన్‌ తయారుచేయడానికి ఎంతో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ పరిశోధనపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వీస్లెర్‌ మాట్లాడుతూ.. ‘స్పైక్‌ ప్రొటీన్‌ను ఉపయోగించుకుని ఈ వైరస్‌ మానవుల సెల్స్‌లో ప్రవేశించి, త్వరగా సోకుతుంది. ఈ స్పైక్‌ ప్రొటీన్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌కు అత్యధికంగా, అసాధారణంగా 37 మ్యుటేషన్స్‌ ఉన్నాయి.

ఈ వేరియంట్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి, గతంలో ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన వారికి కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్‌ ఇంత త్వరగా వ్యాప్తి చెందడానికి గల కారణాన్ని మేం చేసిన పరిశోధన కొంతవరకు దోహదపడుతుంది’ అని అన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమైనాయి.

ఈ పరిశోధనలో ఇప్పటివరకు కరోనా వేరియంట్స్‌లోవచ్చిన రూపాంతరాలు సోకిన రోగుల నుంచి, అలాగే గత రూపాంతరాలను ఎదుర్కొనడానికి టీకాలు తీసుకున్న వారి నుంచి, ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన తర్వాత టీకాలు తీసుకున్న వారి నుంచి యాంటీబాడీలను తీసుకుని వినియోగించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గతంలో వచ్చిన వేరియంట్లు సోకిన వారి నుంచి సేకరించిన యాంటీబాడీస్‌, ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆరు వ్యాక్సిన్లలో ఏదో ఒకదానిని స్వీకరించిన వారి నుంచి సేకరించిన యాంటీబాడీస్‌ని కూడా ఈ పరిశోధనలు అధ్యయనం చేసినట్లు తెలిపారు. మొత్తం మీద ఈ పరిశోధన వల్ల ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్‌ను పరిశోధకులు గుర్తించారు. అలాగే ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ముందస్తుగా.. టీకా మూడో డోస్‌ కూడా తీసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచించారు.