మహారాష్ట్రలో ఒక్క రోజే 198 ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రమవుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం కేసులు వెయ్యికి చేరువలో  ఉండగా, మహారాష్ట్రలో గురువారం ఒక్క రోజే 198 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ పేషెంట్ల సంఖ్య 450కి చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 198 కేసుల్లో ఒక్క ముంబైలోనే 190 వచ్చాయి. మరోవైపు మొత్తంగా కరోనా కేసుల వ్యాప్తి కూడా మహారాష్ట్రను వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది సెకండ్ వేవ్ మొదలైన సమయంలో వచ్చినట్లుగా కేసులు మొదలైపోయాయి.
ఈ ఒక్క రోజే మహారాష్ట్రలో కరోనా కేసులు 5,368 నమోదు కాగా, 22 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,217కు చేరింది. ముంబై సిటీలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ముంబైలోనే గడిచిన 24 గంటల్లోనే 3,671 కేసులు నమోదయ్యాయి.  ముంబైలో ఒక్క రోజునే కరోనా కేసుల సంఖ్య 46 శాతం పెరగగా, ఢిల్లీలో 42 శాతం పెరిగింది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువ‌లో ఉంది. దీనికి తోడు క‌రోనా కేసులు 13,154న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో దేశంలోని ఎనిమిది రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ ప‌లు సూచ‌న‌లు చేశారు. ఢిల్లీ, హ‌ర్యానా,త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, క‌ర్ణాట‌క‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు లేఖ‌లు కూడా రాశారు. 
 
ఈ ఎనిమిది రాష్ట్రాలలో కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని కోరారు. హాస్ప‌ట‌ల్స్ లో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతగా వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కోవిడ్ మరణాలు పెరగకుండా ఉండేందుకు ఇప్ప‌టినుంచే చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించినట్టుగా తెలిపారు. 
 
ఢిల్లీలోని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మోడల్‌ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ఆలోచనను కూడా పరిశీలిస్తున్నట్టుగా ఉన్నత వర్గాలు తెలిపాయి.కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.