షెడ్యూల్ ప్రకారమే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు 

వచ్చే ఏడాది యుపిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎన్ని కలు నిర్వహించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
 
మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఎన్నికల కమిషన్ బృందంను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలసిన్నట్లు గురువారం సీఈసీ సుశీల్ చంద్ర చెప్పారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ, శాసన సభ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని కోరారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా, పంజాబ్‌ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఆరంభంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లు వచ్చాయి. 
 
దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో సమావేశమైన ఇసి రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ పర్యటించింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యింది. లక్నోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇసి ప్రధాన అధికారి సుశీల చంద్ర మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత నిచ్చారు. 
 
బిజెపి, సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌, బిఎస్‌పిలతో పాటు ఇతర పార్టీలన్నీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కోరాయని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర జనాభాలో కరోనా బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్న వర్గాల భద్రతకు  ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న అంశంపై  సూచనలు కూడా ఇచ్చాయని పేర్కొన్నారు. 
 
అన్ని పార్టీల అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. అయితే కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ పలు పార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారని, వీటిపై ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేశాయని చెప్పారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలన్న అలహాబాద్‌ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, యుపి ఎన్నికలు అత్యంత ప్రధానమైనవిగాను, కేంద్ర రాజకీయాల్లో కీలక మార్పులకు మూలంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి.
 
తుది ఓటర్ల జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని చెప్పారు. పోలింగ్‌ను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని పోలింగ్ బూత్‌లలోనూ VVPATలను అమర్చుతామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం దాదాపు 1 లక్ష పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెస్తామని వివరించారు.
 
పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసే సామర్థ్యం లేనటువంటి 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, వికలాంగులు, కోవిడ్ ప్రభావితుల ఇళ్లకు వెళ్లి, ఓట్లు వేయిస్తామని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, శాంపిల్ టెస్ట్‌లను పెంచాలని, కరోనా మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.