కరోనా రెండో వేవ్, రైతు నిరసనలతో గట్టెక్కిన 2021

కరోనా మొదటి వెవ్ నుండి కోలుకొంటూ, ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతున్నదనుకొంటున్న సమయంలో రెండో వేవ్ ఉధృతంగా ప్రవేశించి దేశ ప్రజలను కకావికలం కావించింది. మరోవంక సంవత్సరం పాటు రైతుల నిరసనలు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో జరగడం కూడా అశాంతికి దారితీసింది. 
సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉండడం, ఆఫ్ఘానిస్తాన్ తిరిగి తాలిబన్ల వశం కావడంతో జమ్మూ కాశ్మీర్ లో తిరిగి సీమాంతర ఉగ్రవాదం మొలకెత్తే ప్రయత్నం చేయడం కొంత ఆందోళనలు కలిగించాయి. 
 
ఇదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం, టోక్యో ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు అత్యద్భుత పనితీరు కనబరచడం సంతోషం కలిగించింది. టీకాలలో సహితం అనేక ప్రపంచ రికార్డులను దేశం అధిగమిస్తూ ఉండడం కూడా గర్వకారణమే. 
 
వణికించిన రెండో వేవ్ 

డెల్టా వేరియంట్ ప్రభావంతో భారత్ లో రెండో వేవ్ చాలా సమస్యలు సృష్టించింది. ఒక విధంగా మనం అప్రమత్తంగా లేని సమయంలో ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందే లక్షణాలు  దేశాన్ని వైరస్ చుట్టేసింది. ఏప్రిల్ 30న ఒకేరోజు అత్యధికంగా 4 లక్షల పాజిటివ్ కేసులు, 3500 మరణాలు సంభవించాయి. 

ఈ సమయంలో ఆక్సిజన్ కొరత, హాస్పిటళ్లు నిండిపోవడం, కొన్ని మందుల కొరతలు, సామూహిక శవ దహనాలు వంటివి దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి సెకండ్ వేవ్ నెమ్మదిస్తూ వచ్చింది. ఇప్పుడు తక్కువ కేసులు వస్తున్నా ఒమిక్రాన్ ప్రవేశం ఉద్రిక్తలకు దారితీస్తుంది. అయితే ఈ అనుభవాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో వైద్య మౌలిక సదుపాయాల విస్తరణ పట్ల దృష్టి సారిస్తున్నాయి.

కరోనాపై పోరాటంలో భాగంగా మన దేశంలో  కోవిషీల్డ్, కోవ్యాక్జిన్ టీకాలు ఉత్పత్తి కావడం, అవి అంతర్జాతీయంగా ఆదరణ పొందడంతో మొదటిసారిగా ఈ రంగంలో భారత్ అగ్రగామిగా నిలబడింది. పలు ప్రపంచ దేశాలకు కూడా టీకాలను పంపుతున్నాము.

జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలై, ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సాధిస్తున్నది. ఇప్పటికే 140 కోట్లకు పైగా డోస్ టీకాలను అందించాము. ప్రపంచంలోనే అత్యంత వేగంగా, అత్యధిక ప్రజలకు, భారీ స్థాయిలో టీకాలు అందిస్తున్న దేశంగా గుర్తింపు పొందింది.

తాజాగా, వచ్చే ఏడాది ప్రారంభం నుండి 15 నుండి 18 ఏళ్ళ యువతకు మొదటి డోస్, 60 ఏళ్ళు పైబడిన వృద్దులకు మూడో డోస్ ఇవ్వడానికి కూడా సిద్దపడుతున్నాము.

అలజడి రేపిన సాగు చట్టాలు 

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ పరిసరాలలో కొన్ని రైతు సంఘాలు సంవత్సరం పాటు జరిపిన నిరసనలు అలజడి రేపాయి. ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో హింసాయుత ఘటనలకు దారితీయడంతో మొత్తం దేశ  ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు.

చలిలో, గుడారాలలో నిరసన తెలుపుతున్న పలువురు రైతులు కరోనాకు, ఇతర ఆరోగ్య సమస్యలకు గురై మృతి చెందడం కూడా ఆందోళన కలిగించింది. ఉత్తర ప్రదేశ్ లోని లఖానాపూర్ వద్ద వారి నిరసనలు హింసాయుత సంఘటనలకు దారితీసి, నలుగురు రైతులతో సహా 8 మంది చనిపోవడం పరిస్థితులు అదుపుతప్పే సంకేతాలు పంపాయి.

రైతుల ఆందోళనలపై ఒక దశలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులు తమ నిరసనలు చేసుకోవచ్చని, అయితే రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని సుప్రీం కామెంట్ చేసింది. వెంటనే రోడ్ల వెంట టెంట్లు, బారికేడ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. 

చివరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ చట్టాల ప్రయోజనాల గురించి కొందరు రైతులను ఒపించలేక పోయామని అంగీకరిస్తూ, వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే  రైతుల మేల కోసమే ఆ చట్టాలు తీసుకొచ్చామని, నిపుణులు, రైతులను సంప్రదించిన తర్వాతే కొత్త చట్టాలు చేశామని స్పష్టం చేశారు. దీంతో చివరకు కొత్త చట్టాలు రద్దు చేయడంతో రైతు సంఘాలు కూడా తమ ఆందోళనలకు ముగింపు పలికాయి. 

ఐదు అసెంబ్లీల ఎన్నికలు 

ఇక ఈ ఏడాది 4 కీలక రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం సహా పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో బెంగాల్ లో మమతా బెనర్జీ మూడోసారి అధికారం చేపట్టారు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా చివరకు నిలబడ్డారు. అయితే నందిగ్రామ్ లో ఓడిపోయిన మమత.. మరో చోట గెలిచి సీఎం పదవిలో కొనసాగుతున్నారు. 

బెంగాల్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా పెద్దఎత్తున హింస చోటుచేసుకోవడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేసింది.  పలువురు అధికార పక్షాన్ని వ్యతిరేకించిన వారు మృత్యువాత పడ్డారు.  అవుతున్నారు.  చాలా ఉద్రిక్తతలు, విధ్వంసాలు, మరణాలు సంభవించాయి.

జాతీయ మానవహక్కుల కమీషన్, కొలకత్తా హైకోర్టు జోక్యం చేసుకొని, ఈ హింసాయుత సంఘటనలపై సమగ్రంగా దర్యాప్తు జరిపాయి. బాధ్యులపై పోలీసు కేసులు నమోదు చేసేవిధంగా, బాధితులకు తగు నష్టపరిహారం అందించే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

మరోవంక, కేరళలో ఉన్న రెండు కూటములలో ఒకదాని తర్వాత మరొకటి అధికారమలోకి వస్తున్న సంప్రదాయానికి ముగిరింపు పలుకుతి, ఎల్ డి ఎఫ్ మొదటిసారిగా వరుసగా రెండోసారి అధికారమలోకి వచ్చింది. తమిళనాడులో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే మొదటిసారి పూర్తి మెజారిటీ సంపాదించింది. పుదుచ్చేరిలో మొదటిసారిగా బిజెపి ప్రభుత్వంలో చేరింది. ఇక అసోంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అధికారాన్ని నిలుపుకొంది.

సరిహద్దుల్లో ఉద్రిక్తలు 

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆగష్టు 15న ఆఫ్ఘానిస్తాన్ లో 20 ఏళ్ళ తర్వాత తాలిబన్లు తిరిగి పాలనలోకి రావడంతో జమ్మూ కాశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదానికి ఊతమిచ్చిన్నట్లు అయింది. గత రెండేళ్లుగా తగ్గుతూ వస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలు తిరిగి పుంజుకొంటున్నాయి.

మరోవంక, గత ఏడాది గాల్విన్ లోయలో భారత్ సైనికులను దొంగదెబ్బ తీసే ప్రయత్నంలో పెద్ద ఎత్తున నష్టపోయిన చైనా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. రెండు దేశాల మధ్య సైనికుల స్థాయిలో పలు దఫాలుగా చర్చలు జరిగినా సరిహద్దుల వెంట అక్రమంగా సేనల మోహరింపు, నిర్మాణాల నుండి చైనా వెనుకడుగు వేయడం లేదు.

మరోవంక, భారత సైన్యాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ, భారీ సైనిక సంస్కరణలు దోహదపడుతున్న చీఫ్ అఫ్ డిఫెన్సె స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 8న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది.