సునామి సృష్టిస్తున్న ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు

ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధనామ్‌ గెబ్రెయెసస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్‌ ప్రబలుతుంటే… అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవి రెండూ కలిపి కేసుల సునామీ సృష్టిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. 

ఇప్పటికే పనిభారంతో బాగా అలసిపోయిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిపై ఈ సునామీ మరింత ఒత్తిడిని పెంచుతుందని  అధనామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో కేసులు పెరగడానికి డెల్టా, ఒమిక్రాన్ జంట ముప్పులే బాధితులు ఆస్పత్రుల పాలు కాడానికి, మృత్యువాత పడడానికి దోహదం చేస్తున్నాయని ఆయన తెలిపారు.

ఒమిక్రాన్‌తో ముప్పు తక్కువని ప్రాథమిక గణాంకాలు సూచించినా… అదే నిజమని అప్పుడే స్థిర అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని హెచ్చరించారు.

మరింత విశ్లేషణ జరిగాకే ఒమిక్రాన్‌ తీవ్రతపై పూర్తి స్పష్టతకు రావొచ్చని పేర్కొన్నారు. అమెరికాలో ఒమిక్రాన్‌ ఇప్పటికే ప్రధాన వేరియెంట్‌గా మారగా, ఐరోపాలోని కొన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్‌ బాగా ప్రబలుతోంది. ఒమిక్రాన్‌తో ముప్పు ఇప్పటికైతే తీవ్రమేనని డబ్ల్యూహెచ్‌వో తమ వారాపు నివేదికలో పేర్కొంది. 

డిసెంబరు 20–26 వరకు ప్రపంచవ్యాప్తంగా 49.9 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంటే రోజుకు సగటున 7.12 లక్షల కొత్త కేసులొచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 11 శాతం కేసులు పెరిగాయి. ఈ కేసుల్లో సగం కన్నా ఎక్కువ 2.84 మిలియన్ కేసులు ఐరోపా దేశాల నుంచే ఉన్నాయని తెలిపింది. 

ఇది అంతకు ముందు వారం కన్నా 3 శాతమే ఎక్కువైనా ఇన్‌ఫెక్షన్ రేటు చాలా అధికంగా ఉందని, 1,00,000 మందికి 304.6 వంతున కొత్త కేసులు నమోదయ్యాయని వివరించింది. అదే అమెరికాలో 1,00,000 మందికి 144.4 వంతున ఇన్‌ఫెక్షన్ రేటు కనిపిస్తోందని, దీంతో అమెరికాలో 39 శాతం వరకు అంటే 1.18 మిలియన్ కన్నా ఎక్కువగా కొత్త కేసులు పెరిగాయని తెలియచేసింది.

అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3.56 లక్షల కేసులు రాగా, ఫ్రాన్స్‌లో ఇదివరకూ ఎప్పుడూ లేనంత ఎక్కువగా.. రికార్డు స్థాయిలో 2.08 లక్షల కేసులు నమోదయ్యాయి. యూకేలో 1.29 లక్షల కేసులు వచ్చాయి. 

కాగా, భారత్‌లో మరికొన్ని రోజుల్లోనే కొవిడ్19 కేసులు ఉధృతస్థాయికి చేరుతాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం తెలిపింది. రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని అంచనా వేసింది. ఈ వారంలోనే కేసుల సంఖ్య అధికమవుతుందని.. అయితే, సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదని జడ్జి బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ పాల్‌కట్టుమన్ తెలిపారు.

ఈయన ఆధ్వర్యంలోనే భారత్‌లో కొవిడ్19 ప్రభావాన్ని అంచనా వేసే ట్రాకర్‌ను రూపొందించారు. డిసెంబర్ 24న 6 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడాన్ని ఈ బృందం గుర్తు చేసింది. ఈ రాష్ట్రాల్లో కొత్త కేసుల పెరుగుదల రేట్ 5 శాతానికిపైగా నమోదైందని తెలిపింది. డిసెంబర్ 26వరకల్లా కేసుల పెరుగుదల 11 రాష్ట్రాల్లో నమోదైందన్నారు. అయితే, కేసుల ఉధృతి స్వల్పకాలమే ఉంటుందని కూడా వారు అంచనా వేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలను రాష్ట్రాలకు సూచించడం, వ్యాక్సినేషన్‌ను పెంచడంలాంటివాటిని పరిశోధక బృందాలు పరిగణనలోకి తీసుకుంటాయి.