నూతన సంవత్సరంకు హైదరాబాద్ లో కఠిన ఆంక్షలు

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నా పలు సౌలభ్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసిన, కరోనా నిబంధనలను కఠినంగా పాటించాలని నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు.  అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటి గంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని ప్రభుత్వం ఉత్తరువులు ఇచ్చిన మరుసటి రోజుననే ఆయన ఈ ప్రకటన చేశారు. 

మరోవైపు, నూతన సంవత్సర వేడుకలను నియంత్రించాలన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇటీవల కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు ప్రధాన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టేందుకు పరిశీలిస్తామని హైకోర్టు దర్మాసనం పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు,, కబ్ల్ లు మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు. నూతన సంవత్సర పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన  పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దని చెబుతూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఎక్కడైనా, ఎవరైనా కరోనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాసులను అమ్మొద్దని చెప్పారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దు అని సూచించారు. ఇక, రెండూ డోసుల టీకాలు  తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఇవ్వాలని ఈవెంట్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు.

వేడుకల్లో మాస్క్ తప్పనిసరి అని, వేడుకల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేడుకలకు రెండ్రోజుల ముందు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. సిబ్బందికి 48 గంటల ముందు కరోనా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. వేడుకల్లో డ్రగ్స్ అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.

ఇక, డిసెంబర్‌ 31వ తేదీన రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్టు వెల్లడించారు. తాగి రోడ్లపై హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు తప్పవని స్పష్టం చేశారు.  31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.