ప్రధాని మోదీని విమర్శించడం దేశాన్ని విమర్శించడమే

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వారు దేశాన్ని కూడా విమర్శిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నికల నేపథ్యంలో మణిపూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ, ఇతర రాజకీయ పార్టీలు మోదీని మాత్రమే విమర్శించడం గురించి ఆందోళన చెందుతున్నాయని, అయితే బిజెపికి దేశం పట్ల విజన్ ఉందని చెప్పారు.
 
వారు అవినీతి, కమీషన్ గురించి మాత్రమే ఆలోచిస్తారని, మరోవైపు, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథం బిజెపికి ఉందని ఆయన తెలిపారు.  “మణిపూర్ క్రీడలకు పర్యాయపదంగా ఉంది. మణిపూర్ నుండి చాలా మంది మహిళా క్రీడాకారులు వస్తారు,” అని ఆయన కొనియాడారు  ఖేలో ఇండియా ప్రచారంలో యువత తమను తాము క్రీడలతో ముడిపెట్టాలని నడ్డా పిలుపునిచ్చారు.

“మీకు తిరుగుబాటు కావాలా? స్థిరత్వం కావాలా? విభజించి పాలించే విధానం కావాలా? లేదా శ్రేయస్సు కావాలా? ఎన్‌కౌంటర్లు లేదా శాంతి కావాలా? డ్రగ్స్ లేదా క్రీడలు కావాలా? మీరు ఎంచుకోవాలని ఆయన కోరారు. ఇక్కడి యువత డ్రగ్స్ కంటే క్రీడలను, ఎన్‌కౌంటర్ల కంటే శాంతిని ఎంచుకుంటారని తాను నమ్ముతున్నానని తెలిపారు. 

ఇక్కడ కమలం వికసిస్తేనే మణిపూర్ పురోగమిస్తుందని నడ్డా స్పష్టం చేశారు. మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు మార్చి 2022లో జరగాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం, మణిపూర్‌లో “ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, ఏకీకరణ”కు హామీ ఇచ్చిన ఎన్ బీరెన్ సింగ్   నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రంలోని ప్రజల నుండి భయాన్ని తొలగించిందని నడ్డా పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొని ఉంది.. తన కొడుకు రాష్ట్రం తిరిగి వస్తాడో లేదోనని ఓ తల్లి భయపడేవారు. తన అన్న తిరిగి వస్తాడో లేదోనని సోదరికి తెలియదు.. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత భయం లేదు” అంటూ బిజెపి అధినేత గుర్తు చేశారు. 
 
బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో  మహిళా శక్తి కారణంగా పురోగమించిన కొత్త మణిపూర్‌ని ఇప్పుడు తాను చూస్తున్నట్లు నడ్డా చెప్పారు. మణిపూర్, మహిళా సాధికారత బలంగా అనుసంధానించబడి ఉన్నాయని ఆయన చెప్పారు. మహిళలు వివిధ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొంటే వారి ఆనంద సూచిక వ్యక్తమవుతుందని తెలిపారు.