ఏదైనా అనుకుంటే మోదీ పూర్తి చేసే వరకు నిద్రపోరు 

ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి చేసే వరకు నిద్రపోరని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేని ఒక విశిష్ణ లక్షణం నరేంద్రమోదీకి ఉందని, అదే ఆయన బలమని చెప్పారు. 

అంతే కాకుండా ఆయన పని చేసే విధానం కూడా భిన్నంగా ఉంటుందని ఇది మన్మోహన్‌లో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని పూణెలో లోక్‌సత్తా అనే మరాఠీ పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవార్ పాల్గొని ప్రసంగించారు.

‘‘ఆయన (మోదీ) ఏదైనా పని తన చేతుల్లోకి తీసుకుంటే పని ముగిసే వరకు చాలా అంకితభావంతో పని చేస్తారు. తను బయట ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్‌ను బాగా అదుపు చేస్తారు. అయితే పని విధానంలో నాణ్యత, ఉద్దేశాలు బాగా ఉండాలి. మోదీ తన పనులు అనుకున్నవి అనుకున్నట్లు పూర్తి చేస్తారు…. ” అంటూ వివరించారు. 

తన కెబినెట్‌ని ప్రధానమంత్రి కార్యాలయాన్ని అదుపు చేయడంలో మోదీకి ఒక భిన్న శైలి ఉంటుందని, అది మన్మోహన్‌లో తాను చూడలేదని పవార్ పేర్కొన్నారు. ఇక బీజేపీతో పొత్తుపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు మహారాష్ట్రలో మరింత విస్తృతంగా అమలు చేయడానికి బీజేపీతో చేతులు కలపమని మోదీ తనను 2019లో  కోరినట్లు చెప్పుకొచ్చారు.

 అయితే మోదీ ప్రతిపాదనను తాను తిరస్కరించానని పవార్ తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి  గాంధీ, నెహ్రు విధానాలను వదిలి పెట్టలేదని స్పష్టం చేశారు.

శివసేన అధినేత బాబాసాహెబ్ థాకరేతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఆయన తన గురించి పలుసార్లు `పరుషమైన’ పదజాలం ఉపయోగించేవారని, అయితే అవెప్పుడు తమ మధ్య స్నేహానికి, సహకారానికి  ఆటంకం కలిగించలేదని స్పష్టం చేశారు. పైగా రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి తనతో చర్చించేవారని చెప్పారు. 

1991లో తాను తిరిగి రాష్ట్ర రాజకీయాలకు రావాలనుకోలేదని, కానీ ఒక `సవాల్’ ఎదురైనప్పుడు తాను స్వీకరించానని తెలిపారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘడి ప్రభుత్వం సుస్థిరతపై తనకు ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏది జరిగినా తానే నడిపిస్తున్నట్లు వార్తలు వస్తుంటాయని, అయితే అవసరమైనప్పుడు తాను సలహాలు ఇస్తూంటానని చేప్పారు.