మరో రెండు కరోనా టీకాలు అనుమతి

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాను అరికట్టేందుకు భారత్‌ ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంత దిశగా తీసుకెళ్లింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తోన్న వేళ వైరస్‌పై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ మంగళవారం భారత్‌ మరో రెండు కరోనా  టీకాలను ఆమోదించింది.  

వ్యాక్సిన్లు- కొవావాక్స్‌, కార్బోవాక్స్‌, యాంటీ వైరల్‌ డ్రగ్‌ ‘మోల్నూపిరావిర్‌’లను అత్యవసర వినియోగానికి అనుమతించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవీయ ప్రకటించారు. ఈ తాజా ఆమోదంతో దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన కోవిడ్‌ వ్యాక్సిన్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె) తయారుచేసిన ‘కొవొవాక్స్‌’కు, బయోలాజికల్‌-ఈ తయారు చేసిన కార్బివాక్స్‌కు అనుమతులు మంజూరు చేయాలని, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఒ) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మేరకు కేంద్రం వాటి వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వీటి వినియోగానికి ఆమోదం లభించిందని మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవీయ చెప్పారు.

”కంగ్రాట్యులేషన్స్‌ ఇండియా ఫ్లాగ్‌ ఆఫ్‌ ఇండియా. కరోనాపై పోరాటాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ పరిధిలోని సిడిఎస్‌సిఎ ఒకే రోజు మూడింటికి (వ్యాక్సిన్‌, పిల్‌) అనుమతించింది” అని ఆ ట్వీట్‌లో మాండవీయ పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ కొవొవాక్స్‌ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరులోనే డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసింది. బ్రిటన్‌, అమెరికాల్లో ఈ టీకాపై చేపట్టిన 2, 3 దశల క్లినికల్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను జతచేసింది.  

ఈ క్రమంలోనే సిడిఎస్‌సిఒ నిపుణుల బఅందం దీన్ని పరిశీలించి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయవచ్చని సోమవారం సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బివాక్స్‌కు అనుమతినిచ్చింది.

మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవీయ మాట్లాడుతూ కరోనా వ్యాధికి ‘మోల్నుపిరవిర్‌’ ఔషధం అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. మెర్క్‌, రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరప్యూటిక్స్‌ సంయుక్తంగా ఈ యాంటీ-వైరల్‌ ఔషధాన్ని అభివృద్ధి చేశాయని తెలిపారు.

ఇప్పుడు భారత్‌లో ఈ ఔషధాన్ని 13 సంస్థలు తయారు చేస్తాయని వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న వయోజనులు, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేసేందుకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వినియోగిస్తారని మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవీయ స్పష్టం చేశారు. 
ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌
ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటు 0.5 శాతం కన్నా అధికంగా ఉండటంతో.. వైరస్‌ కట్టడి చేసేందుకు గ్రెడేడ్‌ రెస్పాన్‌ యాక్షన్‌ ప్లాన్‌ లెవల్‌ -1 కింద ఎల్లో అలర్ట్‌ను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ప్రకటించారు. 

దీంతో మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అక్కడ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎల్లో ఎలర్ట్‌ నేపథ్యంలో సినిమా ధియేటర్లు, జిమ్స్‌ మూతపడతున్నాయి. మాల్స్‌, షాపులు.. సరి, బేసి సంఖ్యల ఆధారంగా తెరుచుకోనున్నాయి.

ఎల్లో అలర్ట్‌ నిబంధనలు 

  • సరి, బేసి సంఖ్యల ఆధారంగా మాల్స్‌, షాపులు.. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరుచుకోనున్నాయి.
  •  ప్రైవేటు సంస్థల్లో 50 శాతం సిబ్బందితో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది.
  • వివాహ వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే అనుమతి
  • మూత పడనున్న సినిమా ధియేటర్లు, మల్లిప్లెక్స్‌లు, జిమ్‌లు
  •  విద్యాసంస్థలకు తాళం
  •  రాత్రి 10 తర్వాత రెస్టారెంట్లు, బార్లు మూత.. తెరిచిన సమయంలో కెపాసిటీలో సగం మందికే అనుమతి
  •  ఢిల్లీ మెట్రో కూడా సగం సామర్థ్యతతోనే కార్యకలాపాలు సాగించనుంది
  •  ఆన్‌లైన్‌ డెలివరీ కొనసాగింపు
  • రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ
  •  సెలూన్‌, బార్బర్‌ షాపులు, పార్లర్లకు తాళం
  •  స్పా, వెల్‌నెస్‌ క్లినిక్స్‌ కూడా
  •  రాజకీయ, మతపరమైన, పండుగులకు సంబంధించిన సమూహాలకు అనుమతి నిరాకరణ