అవినీతి పరిమళం చల్లింది… ప్రధాని ఎద్దేవా

కాన్పూర్‌కు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారి నుంచి కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎస్పీపై విరుచుకుపడ్డారు. ఇది ప్రతిపక్ష పార్టీ సాధించిన “గొప్పతనం, వాస్తవికత” అంటూ ఎద్దేవా చేశారు.

“బయటకు వచ్చిన నోట్లతో నిండిన పెట్టెలు, ఇది కూడా మేమే చేశామని వారు (సమాజ్‌వాదీ పార్టీ) చెబుతారని నేను అనుకున్నాను. కాన్పూర్ ప్రజలు వ్యాపారాన్ని బాగా అర్థం చేసుకుంటారు. 2017కి ముందు ఉత్తరప్రదేశ్‌ అంతటా వారు చల్లిన అవినీతి పరిమళం అందరికీ కనువిందు చేసింది” అని కాన్పూర్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు,  356 కిలోమీటర్ల పొడవైన బినా-పంకీ బహుళ ఉత్పత్తుల పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ప్రధాని ఎవ్వరి పేరును ప్రస్తావించకుండా ధ్వజమెత్తారు. 


“కానీ ఇప్పుడు నోరు మూసుకుని కూర్చున్నారు. దేశం మొత్తం చూసిన కరెన్సీ నోట్ల కొండెక్కి క్రెడిట్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇది వారి ఘనకార్యం, వారి వాస్తవికత. ఉత్తరప్రదేశ్ ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు.  అర్థం చేసుకుంటున్నారు, అందుకే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న వారితో వారు ఉన్నారు,” అంటూ వారి మద్దతు బీజేపీకే ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. 

కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 54వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటూ  గ్రాడ్యుయేట్‌లు సౌకర్యం కంటే సవాళ్లను వెంబడించాలని కోరారు. వారు భారతదేశపు స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నారని తెలిపారు. 
నిమ్మళంగా ఉండే పరిస్థితుల్లో ఉండాలని కోరుకోవడానికి బదులుగా సవాళ్ళను ఎంచుకోవాలని విద్యార్థులకు ప్రధాన  పిలుపునిచ్చారు. 
 
ఇప్పుడు కొత్తవాటి గురించి భయం అనేదే లేదని అంటూ యావత్తు ప్రపంచాన్ని తెలుసుకునే సత్తా విద్యార్థులకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఫలానా విషయం తెలియదు’ అనే ప్రశ్నే ఇక లేదని, అత్యుత్తమమైనదాని కోసం అన్వేషణ, యావత్తు ప్రపంచాన్ని జయించాలనే కల ఉన్నాయని ప్రధాని చెప్పారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థలో వెచ్చించిన సమయం విద్యార్థుల్లో పెను మార్పులను తీసుకొచ్చిందన్నారు. వారికి ఐఐటీ కాన్పూరు ఓ గొప్ప వేదికను అందుబాటులో ఉంచిందని చెప్పారు. విద్యార్థులు సవాళ్ళను ఎంచుకోవాలని, నిమ్మళం (కంఫర్ట్)గా ఉండే పరిస్థితులను కాదని తెలిపారు. 

ఇప్పుడు తెలియనివాటి గురించి భయమే లేదన్నారు. యావత్తు ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే సత్తా విద్యార్థులకు ఉందని చెప్పారు. ఫలానా విషయం తెలియదనే ప్రశ్నే ఇక లేదని, అత్యుత్తమమైనదాని కోసం అన్వేషించవచ్చునని, యావత్తు ప్రపంచాన్ని జయించాలని కలలుగనవచ్చునని తెలిపారు. 

విద్యార్థులు పొందిన శిక్షణ, సంపాదించిన నైపుణ్యం, విజ్ఞానం కచ్చితంగా ఈ ప్రపంచంలో తమదైన ముద్ర వేసుకోవడానికి దోహదపడతాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి, విజేతలుగా నిలవాలని చెప్తూ, రోబోలుగా మారిపోవద్దని ప్రధాని మోదీ  హెచ్చరించారు. అంశాలపై ఇంటర్నెట్‌లో పని చేయాలని, అయితే ఆయా అంశాల భావోద్వేగాలను మర్చిపోకూడదని తెలిపారు. 

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 25 ఏళ్ళు పూర్తయ్యేనాటికి మనం మన కాళ్ళపై నిలబడటానికి ఎంతో చేసి ఉండవలసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి చాలా ఆలస్యం జరిగిందని, మన దేశం చాలా సమయాన్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రెండు తరాలు గడిచిపోయాయని, ఇక కనీసం రెండు క్షణాలనైనా మనం కోల్పోకూడదని స్పష్టం చేశారు. 

ప్రధాని మోదీ వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్,  కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తదితరులు ఉన్నారు. కాన్పూర్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవ స్థలానికి వెళ్లిన ప్రధాని కాన్పూర్ మెట్రోలో కూడా ప్రయాణించారు.

ఐఐటీ-కాన్పూర్ నుంచి మోతీ జీల్ వరకూ సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రైల్ ప్రాజెక్టు ఇది. మొత్తం 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును 11,000 కోట్లతో పూర్తి చేస్తున్నట్టు పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మోదీ ప్రధానంగా దృష్టి సారిస్తున్న అంశాల్లో అర్బన్ మొబిలిటీ ఒకటని, ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్ట్ మరో ముందడుగని తెలిపింది.