బీజేపీలో ఇద్దరు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు 

 
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో పంజాబ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే ఫతే జంగ్ సింగ్ బాజ్వాతోపాటు బల్వీందర్ సింగ్ లద్దీ కాంగ్రెస్ ను వీడారు.

కాగా పంజాబ్ కు చెందిన మాజీ క్రికెట‌ర్ దినేష్ మోంగియా కూడా  బిజెపిలో చేరారు. ఈయ‌న వ‌య‌స్సు 44. భార‌త్ త‌ర‌పున అంత‌ర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు.
 
ఫతే జంగ్ బాజ్వా.. ఖ్వాదియాన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ఈ మధ్యనే ఓ ర్యాలీలో బాజ్వాను త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఖ్వాదియాన్ అభ్యర్థిగా ప్రకటించారు. 
 
కానీ ఫతేజంగ్ సోదరుడైన ప్రతాప్ బాజ్వా ఈసారి ఖ్వాదియాన్ స్థానంపై కన్నేశారు. ఈ క్రమంలో ఫతే జంగ్ పార్టీని వీడటం చర్చనీయాంశమైంది. మరోవైపు హర్గోబింద్ పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లద్దీ బీజేపీలో చేరారు. 
 
మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రానా గుర్మీత్ సోది సైతం గతవారమే పార్టీకి గుడ్ బై చెప్పి కమలదళంలో చేరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గత నెలలో కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి పెట్టుకున్న అమరీందర్ సింగ్ కు అత్యంత విశ్వాసపాత్రులు. 
 
అయినప్పటికీ వారు అమరీందర్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ లో చేరకుండా బీజేపీలో చేరడం విశేషం. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పొత్తులపై దృష్టి సారించింది. ఇప్పటికే అమరీందర్ సింగ్ తో జట్టు కట్టింది. కేంద్ర మంత్రి, పంజాబ్ ఎన్నికల బిజెపి ఇన్ ఛార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ వారిని బిజెపిలోకి ఆహ్వానించారు.