దేశంలో 700 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 700 దాటేసింది. మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 56 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. 

అతి తక్కువగా యూపీలో రెండు, గోవా, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, మణిపూర్ లో ఒక్కో కేసు నమోదు అయింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. మరోవైపు దేశంలో కొత్తగా 6వేల 358 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రికవరీ రేటు 98.40శాతానికి చేరుకుందని తెలిపారు అధికారులు. 

ఒమిక్రాన్ సహా కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది కేంద్రప్రభత్వం. కంటెయిన్ మెంట్ చర్యలు తీసుకోవాలని సూచించింది. పండుగ సీజన్ లో జనం గుమిగూడకుండా చూసేందుకు ఆంక్షలు విధించాలని చెప్పింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ను మరింతగా వేగం చేయాలని సూచించింది కేంద్రం. కొత్త వేరియంట్ విషయంలో మరింతగా అలర్ట్ గా ఉండాలని చెప్పింది.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డెల్టా కంటే మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నూతన సంవత్సర  వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రిపూట  కర్ఫ్యూ కొనసాగుతోంది. 

ఇలా  ఉండగా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్  త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదురాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో కరోనా పరిస్థితి గురించి సమీక్ష జరిపారు. గోవా, ఉత్తరాఖండ్ లలో మాత్రమే 100 శాతం టీకాలు పూర్తయిన్నట్లు గమనించి, మిగిలిన రాష్ట్రాలలో కూడా టీకాలు వేగవంతం చేయమని కోరారు.