
డిసెంబర్ ప్రారంభంతో పోలిస్తే ఢిల్లీలో కరోనా కేసులు పది రెట్లు పెరిగాయి. కేసులు పెరుగుతున్నతీరును చూస్తే ఒమిక్రాన్ ప్రభావం కనిపిస్తున్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరికల్లా ఢిల్లీలో కేసులు శిఖరస్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో ఆదివారం 290 కొత్త కేసులు నమోదు కాగా, పాజిటివిటీ రేట్ 0.55గా రికార్డయింది. సోమవారం 331 కేసులు నమోదు కాగా, పాజిటివిటీ రేట్ 0.68కు ఎగబాకింది. డిసెంబర్ 1న ఢిల్లీలో 39 కొత్త కేసులతో పాజిటివిటీ రేట్ 0.07గా నమోదైంది. మరుసటిరోజు 41 కేసులతో 0.06కు పాజిటివిటీ తగ్గింది.
డిసెంబర్ 9 నుంచి 15 మధ్య సగటున రోజుకు 48 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 16 నుంచి 22 వరకు సగటున రోజుకు 95 కేసులు నమోదయ్యాయి. దాంతో,వారంలో పాజిటివిటీ రేట్ 49.47కు ఎగబాకింది. వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ ప్రభావం వల్ల కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నట్టుగా ఉన్నదని అంటువ్యాధుల నిపుణుడు గిరిధర్ ఆర్ బాబు పేర్కొన్నారు.
కేసులు ఒక్కసారిగా పెరగడం, తగ్గడంలాంటివి జరుగుతాయని తెలిపారు. కేసుల సంఖ్య జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకల్లా శిఖరస్థాయికి చేరనున్నట్టు ఆయన అంచనా వేశారు. కేసులు, పాజిటివిటీ రేట్ పెరుగుతున్నా మరణాలు అధికంగా ఉండవని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో అంటువ్యాధుల విభాగం హెడ్ డాక్టర్ జుగల్‌కిషోర్ చెప్పారు.
ఇప్పుడు రికార్డవుతున్న కేసుల్లో 60 నుంచి 70 శాతం వరకు ఒమిక్రాన్‌వి, మిగతావి వేరే వేరియంట్లవి ఉండవచ్చునని ఆయన తెలిపారు. చలికాలంలో మూసిన గదుల్లో ఎక్కువగా గడపడం వల్ల వైరస్ కేసులు పెరుగుతాయని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోనివారు, ఇప్పటివరకు ఇన్‌ఫెక్షన్‌కు గురికానివారి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ వల్ల ఇన్‌ఫెక్షన్ రాదని భరోసా ఇవ్వలేం. కానీ, తీవ్రతను తగ్గిస్తుందని చెప్పగలమని ఆయన అన్నారు.
More Stories
ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు
మహాకుంభ్లో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి